ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాల్ మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. కాగా, పాల్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా వెళుతుండగా, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనం దిగి వారితో మాట్లాడుతుండగానే గుంపులో ఉన్న ఓ వ్యక్తి పాల్ పై అటాక్ చేశాడు.
ఈ హఠాత్పరిణామానికి పాల్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. డీఎస్పీ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాగా, కేఎల్ పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తిని జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనపై దాడి జరిగిన నేపథ్యంలో కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. మీరు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు. రైతులను అటు మోదీ గానీ, ఇటు కేసీఆర్ గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతుల కోసమే తాను వచ్చానని, తాను వస్తానని చెబితే వచ్చి తీరతానని కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.