తెలంగాణలో సూరీడు మంటపుట్టిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లాలో ఇవ్వాల (మంగళవారం) 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటి వరకు ఇదే హైయస్ట్ టెంపరేచర్గా ఉంది. ఇక హైదరాబాద్ సిటీలోనూ ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గచ్చిబౌలి 39.9 డిగ్రీలుగా ఉంది. ఇక.. షేక్పేట్లో 38.9 డిగ్రీల సెల్సియస్, మియాపూర్లో 38.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. వేడితీవ్రత బుధవారం కూడా కొనసాగనుంది. అయితే.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసి కొంత ఉపశమనం కలిగించనున్నట్టు తెలుస్తోంది.
ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వాతావరణంలో తలెత్తిన మార్పుల వల్ల రానున్న రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ (IMD) అంచనా వేసింది. హైదరాబాద్లో కూడా గురు, శుక్రవారాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో వర్షం కురవనున్నట్టు తెలుస్తోంది. నగరంలో శనివారం పాక్షికంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్ మహానగరం యొక్క సగటు గరిష్ట ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని IMD అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు లేదా మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు చెదురుమదురు వర్షాలు కురువనున్నాయి.