కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకుంటున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో తొలి డోస్‌లో ఒక కంపెనీకి చెందిన టీకా, రెండో డోస్‌లో మరో కంపెనీకి చెందిన టీకా తీసుకోవచ్చా అన్న సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది? రోగ నిరోధక ప్రతిస్పందన ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే ప్రజల సందేహాలకు సమాధానాల కోసం బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు ప్రారంభించింది. కాంబినేషన్ ఆఫ్ కొవిడ్ వ్యాక్సిన్స్ (కామ్ – కావ్) పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రయోగ పరీక్షలను పరిశోధకులు ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లు చెరో డోసు అందించే వారిలో వస్తున్న ఆరోగ్య మార్పులను, రోగ నిరోధక ప్రతిస్పందనలను నమోదు చేసి శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని శాస్త్రవేత్తలు మరింత విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా మరో 1,050 మంది వాలంటీర్లను భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడెర్నా, నోవావ్యాక్స్ కరోనా వ్యాక్సిన్లను చెరో డోసు అందిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రయోగాలు చేయనున్నట్లు ట్రయల్స్‌కు చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్న మ్యాథ్యూ స్నేప్ వెల్లడించారు.