హాస్టల్ గదిలో ఉంటున్న ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో జరిగింది. కోట్ పుట్లీ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ ముఖేష్ కు ఆయు ష్ అనే 22 ఏండ్ల కూతురుంది. ఆమె సర్దార్ పటేల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. అదే హాస్టల్ లో ఉంటున్న ఆమెకు కాలేజీలో చదువుతున్న చందా ప్రజాపత్ అనే మరో యువతితో పరిచయం ఏర్పడింది.
కొంతకాలం బాగానే ఉన్న వారి ఫ్రెండ్‌షిప్‌లో ఆ తర్వాత తేడా వచ్చింది. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఏడు నెలలుగా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. అయినా వాళ్ల తీరు మారకపోవడంతో హాస్టల్‌లోని ఒకే గదిలో వారిద్దరిని ఉంచారు. అలా ఉంటే మారుతారని అంతా భావించారు.
అయితే రాత్రిపూట చందా ప్రజాపత్ కు చదివే అలవాటు ఉంది. ఆయుష్ కేమో ఉదయం చదివే అలవాటు ఉంది. దీంతో ఇద్దరి మధ్య లైట్స్ విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి. రాత్రంతా లైటింగ్ వెలుతురులో పడుకోవడం వల్ల ఆయుష్‌కు మైగ్రేన్ సమస్య తలెత్తింది. ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. గదిలో చందా ప్రజాపత్ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. తన కూతురు చావుకు కారణం ప్రజాపత్ అంటూ ఆయుష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నామని, ఆయుష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చందా ప్రజాపత్ కు, మరో విద్యార్థిని నహర్ సింగ్ కు వీడియో కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇదంతా ఆమె కాల్ రికార్డ్స్ ద్వారా తెలిసిందన్నారు. వారితో ఏం మాట్లాడిందనే విషయాన్ని కనుక్కుంటున్నామన్నారు.