Friday, November 22, 2024

Big Story: ముంబై, హైదరాబాద్ లో.. వ‌ర్క్ టైమింగ్‌పై గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్‌..

ముంబై: నానాటికీ పెరుగుతున్న భూతాపం వల్ల ముంబై, హైదరాబాద్ సహా పలు భారతీయ నగరాలలో ఉద్యోగులు, శ్రామికుల పనివేళలపై తీవ్ర ప్రభావం పడబోతోందని తాజా అధ్యయనం తేల్చింది. ప్రత్యేకించి.. భవిష్యత్ లో దేశ ఆర్థిక రాజధానిలో ఉదయం లేదా సాయం సమయాల్లో మాత్రమే పనిచేసుకునే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయని హెచ్చరించింది. డ్యూక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలోని కీలక అంశాలను ప్రఖ్యాత జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురించారు. ముంబై మహానగరంలో ప్రస్తుత రీతిలోనే కర్బన ఉద్గారాల వెల్లువ కొనసాగుతున్నట్టయితే ఈ దుస్థితి తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ఉన్న ఉష్ణోగ్రతలవల్లే ఏర్పడుతున్న ఉక్కపోత, స్వేదం వల్ల ప్రతి గంటలో నాలుగైదు నిమిషాల చొప్పున విలువైన పని చేసే సమయాన్ని నష్టపోతున్నామని, సగటున రోజుకు 12 గంటల పనివేళలు అనుకుంటే మొత్తంమీద గంట సమయాన్ని కోల్పోతున్నట్టేనని ఆ నివేదిక పేర్కొంది.

భవిష్యత్ లో ఈ భూతాపం మరొక్క డిగ్రీ పెరిగినా గంటకు పది నిమిషాల మేర పనిచేసే సమయాన్ని నష్టపోక తప్పదని హెచ్చరించింది. ముంబై తరహాలోనే చెన్నయ్, హైదరాబాద్ లో కూడా ఇదే పరిణామాలు సంభవించనున్నాయని పేర్కొంది. ఇక అహ్మదాబాద్ లో గంటకు పన్నెండు నిమిషాల మేర పని చేసే సమయాన్ని నష్టపోతామని ఉదహరించింది. ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న భూతాపం కారణంగా ఏర్పడే ఉక్కపోత, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకించి ఉద్యోగులు, శ్రామికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫలితంగా ఏటా ప్రపంచంలో 280 మిలియన్ డాలర్ల నుంచి 311 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. భవిష్యత్ లో ఉష్ణోగ్రత 2 శాత పెరిగినా ప్రపంచం 1.6 ట్రిలియన్ డాలర్ల మొత్తాన్ని నష్టపోతుందని అంచనా వేశారు. భరించలేని వేడి, ఉక్కపోత మధ్య పనిచేసేందుకు ఉద్యోగ, శ్రామికవర్గాలు సిద్ధపడవని, వారు ముందుకొచ్చినా నిద్రలేమి, అలసట వల్ల ఉత్పాదకత దెబ్బతింటుందని అందువల్ల చల్లబాటు వేళ పనిచేసేలా పనివేళలు మార్చుకోక తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. ఇక్కడ వారు చెప్పిన కీలక అంశం ఏమిటంటే రోజుమొత్తం మీద.. ఈ చల్లబాటు వేళ తగ్గిపోతుందని, ఫలితంగా పనిచేసే వేళలూ తగ్గిపోతాయని.

Advertisement

తాజా వార్తలు

Advertisement