Saturday, November 23, 2024

Serious Comments | ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను చెప్పులతో కొట్టండి.. మోదీపై శ్రీరామసేన ఆగ్రహం

మోదీ ఫొటోపెట్టుకుని ఓట్ల కోసం వచ్చే బీజేపీ లీడర్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు శ్రీరామసేన అధినేత ప్రమోద్​ ముతాలిక్​. అభివృద్ధి, గో సంరక్షణ, హిందూత్వలో తాము సాధించిన విజయాలను చూపించి మాత్రమే ఓట్లు అడగాలని డిమాండ్​ చేశారు. మోదీ పేరుతో ఓట్లు అడిగేవారు అస్సలు పనికిరారని, వారి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బీజేపీ నేతలను చెప్పులతో కొట్టాలని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్నాటకలోని బీజేపీ నేతలు ప్రధాని మోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ పేరు, ఫొటో ఉపయోగించకుండా ప్రచారం చేయాలని సవాల్ చేశారు.. అభివృద్ధి, గోసంరక్షణ, హిందుత్వలో తాము సాధించిన విజయాలను చూపించి మాత్రమే ఓట్లు అడగాలన్నారు. పనికిమాలిన బీజేపీకి మద్దతివ్వవద్దని ఓటర్లను అభ్యర్థించారు. ఓట్ల కోసం మోదీ పేరును ఎలా వాడుకోవాలో ఆ పార్టీకి మాత్రమే తెలుసునని మండిపడ్డారు.

తన విమర్శలను కొనసాగిస్తూ.. బీజేపీ నాయకులు తమ పనిని బట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలన్నారు. మోదీ పేరుతో ఓట్లు అడిగే వారు పనికిరాని, వారు ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడం లేదన్నారు. అయితే.. శ్రీరామసేన అధినేత ముతాలిక్​ జనవరి 23న ఓ సంచలన ప్రకటన చేశారు. కర్కల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

బీజేపీపై హిందూ వర్గాల్లోనూ అసంతృప్తి..

- Advertisement -

కొన్ని హిందూ గ్రూపుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో శ్రీరామసేన అధినేత బీజేపీపై విమర్శలదాడి పెంచారు. హిందూ ప్రయోజనాలను కాపాడే సామర్థ్యం ఉన్న ఏకైక పార్టీగా తమను తాము అభివర్ణించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, కొన్ని సంఘాలు మాత్రం అందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి. కర్నాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు గెలుపొందడానికి పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు కర్నాటకపైనే కాకుండా జాతీయ రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

దక్షిణ కర్నాటకలోని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ-జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించేందుకు అధికార బీజేపీ ఈ ప్రాంతంపై దృష్టి సారించడంతో దక్షిణ కర్నాటకలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పోరు తీవ్రమైంది. ఈ ప్రాంతంలోని ఓటర్లపై ప్రభావం చూపేందుకు కాషాయ పార్టీ బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్‌వేపై ప్రధాని మోదీ రోడ్‌షోను నిర్వహిస్తుండగా, బీజేపీని ఎదుర్కోవడానికి JD(S) కూడా ఇదే విధమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది.

JD(S) ప్రధాన బలమనై దక్షిణ కర్నాటక.. రామ్‌నగర్, మాండ్య, మైసూరు ప్రాంతాలపై ఫోకస్​ పెడుతోంది. ఇక్కడ వొక్కలిగాస్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. ఓటర్లపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రతివ్యూహాన్ని జేడీఎస్​ ప్లాన్ చేస్తోంది.  ఇక.. ఎక్స్ ప్రెస్‌వేపై బెంగళూరు-మైసూరు మధ్య రోడ్‌షో నిర్వహించాలని జెడి (ఎస్) నిర్ణయించింది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ రోడ్‌షోకు నాయకత్వం వహించనున్నారు. జేడీ(ఎస్) ఓటు బ్యాంకు చీలకుండా జాగ్రత్తపడతామని పార్టీ అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement