న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్నో మారథాన్‌కు హిమాచల్ ప్రదేశ్ వేదికైంది. రీచ్ ఇండియా ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఈ మంచు మారథాన్‌ను నిర్వహించారు. మనదేశంలోనే తొలిసారి 10 వేల అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ మంచు మారథాన్‌లో దాదాపు వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానికుల కోసం ఒక కిలోమీటర్ రేస్ నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటివరకు స్నో మారథాన్‌లను ధ్రువ ప్రాంతాలు, అంటార్కిటికా, రష్యా, ఉత్తర ఐరోపా వంటి శీతల మంచు ప్రాంతాల దేశాల్లోనే నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. లౌహౌల్‌లో నిర్వహించిన ఈ పోటీల ద్వారా స్నో మారథాన్‌లను నిర్వహించే దేశాల సరసన భారత్ కూడా చేరిందని హర్షం వ్యక్తం చేశారు.
పురుషుల విభాగంలో శాశ్వత్ రావ్ విజేతగా నిలవగా, మహిళల విభాగంలో స్థానికురాలైన డోల్మా టెన్జిన్ విజేతగా గెలుపొందారు. 21 కిలోమీటర్ల హాఫ్‌మారథాన్ విభాగంలో, పురుషుల విభాగంలో రోహన్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. మహిళల విభాగంలో దీక్ష టైటిల్ గెలుచుకుంది. ఇలా వివిధ విభాగాల్లో నిర్వహించిన స్నో మారథాన్‌లో పలువురు విజేతలుగా నిలిచారు. ఇకపై మరిన్ని స్నో మారథాన్‌లు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. స్నో మారథాన్‌లు నిర్వహించడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడతామని వింటర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.