హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రెండో విడత దళితబంధుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డిసెంబర్ నుంచి రెండో విడతను రాష్ట్రమంతటా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ మేరకు అవరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. డిసెంబర్ తొలి వారంలో నియోజకవర్గానికి 500మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించి దళితబంధును సాకారం చేసేలా కార్యాచరణ చేస్తోంది. 2022-23 ఏడాదికి మొత్తం 1,17,000 మందికి రూ.10 లక్షల చొప్పున రూ.17 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. మొదటి విడత పైలెట్ ప్రాజెక్టు అమలులో ఎదురైన అవాంతరాలు పునరావృతం కాకుండా పకడ్బందీగా పథకం అమలు దిశగా దృష్టి సారించారు.
ఇందుకుగానూ దళితబంధు ప్రత్యేక వెబ్‌సైట్‌తోపాటు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను తీసుకురావాలని భావిస్తున్నది. దీనిని ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌తో అనుసంధానించి పర్యవేక్షణ జరపనున్నారు. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలతో దళితుల జీవితాలను అభివృద్ధిపర్చి ఆర్థిక స్వావలంభన దిశగా పురుడుపోసుకున్న దళితబందు పధకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 1500 కుటుంబాల చొప్పున 118 నియోజకవర్గంలలో 1,77,00 మంది లబ్ధిదారులకు దళితబందు పథకాన్ని అందించేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి.
ఈ ఏడాది మొదటి దశలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 59,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటున్నది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు పథకం కింద ఇప్పటివరకు 36,392 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం నిధులను జమచేసింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగారాష్ట్రవ్యాప్తంగా 31,088 యూనిట్లు గ్రౌండింగ్ జరిగి పురోగతిలో ఉన్నాయి.