ఇంటర్ (12వ తరగతి) ప్రభుత్వ పరీక్షలు రాసే విద్యార్థులు ఎక్కడైనా చీకట్లో పరీక్ష రాయడం మీరు చూశారా… ఇది బిహార్‌లో సాధ్యం అయ్యింది. అక్కడ పరీక్షలు రాస్తున్న 400 మంది విద్యార్థులు విద్యుత్తు లేని బిల్డింగ్‌లో కారు లైట్లవెలుగులో పరీక్ష రాశారు..
కొంచెం చీకటి ఉంటేనే మన దగ్గర లైట్లు వేయడమే.. లేకుంటే ఆరుబయట చెట్ల కింద కూర్చోబెట్టి రాయించడమే చేస్తారు. కానీ, బిహార్‌లో ఏకంగా కారు లైట్ల వెలుగులో 400 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇది కుంభకోణం అని కొంతమంది, పరీక్షల ఉల్లంఘన కింద తీసుకోవాలని ఇంకొంతమంది ఉన్నతాధికారులకు కంప్లెయింట్ చేస్తున్నారు. బిహార్‌లోని మోతిహారిలోని ఒక పరీక్షా కేంద్రంలో 400 మంది విద్యార్థులు – 12వ తరగతి (ఇంటర్మీడియట్) తమ హిందీ పరీక్షకు హాజరయ్యారు. గదిలో చీకటిగా ఉండడంతో కారు హెడ్‌లైట్ల వెలుగులో మహారాజా హరేంద్ర కిషోర్ కళాశాలలో ఈ పరీక్ష రాత్రి 8 గంటల వరకు నిర్వహించారు.
ఆ రోజు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో విడత పరీక్షల్లో చివరి నిమిషంలో సీటింగ్‌లో గందరగోళం కావడంతో సాయంత్రం 4.30 గంటల వరకు విద్యార్థులకు జవాబు పత్రాలు అందలేదని ఆరోపించారు. పరీక్ష కేంద్రం వద్ద నిరసనలు, గందరగోళం చెలరేగడంతో పోలీసులను రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలతో సీనియర్ పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని సర్దుకుని విద్యార్థులు పరీక్ష రాసే సమయానికి చీకటి పడింది. అయితే కేంద్రంలో కరెంటు లేకపోవడంతో మరికొంత గందరగోళం నెలకొంది.
చివరగా జనరేటర్‌లను ఏర్పాటు చేశారు. అయినా విద్యుత్ కాంతి సరిపోకపోవడంతో కార్లు ఉన్న తల్లిదండ్రులు వారి హెడ్‌లైట్‌లను ఆన్ చేశారు. తద్వారా విద్యార్థులు కనీసం బయట కారిడార్‌లో కూర్చుని పరీక్ష రాయవచ్చు అనుకున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అక్కడి జిల్లా అధికారులు ఉన్నతాధికారి విచారణకు ఆదేశించారు.