Tuesday, November 19, 2024

వణికిస్తున్న చలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అటవీ ప్రాంతాల్లో మరీ తీవ్రం

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ఓ వైపు చలి తీవ్రత.. మరోవైపు పులిసంచారం జనాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దినదినం పడిపోతున్నాయి. సాధారణంగా మైదాన ప్రాంతాలతో పోలిస్తే అటవీ ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అది రాత్రి సమయంలో మరింత తగ్గిపోతుంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10, 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ, అటవీ ప్రాంతాల్లో 7, 8 డిగ్రీల వరకు వెళుతున్నట్లు అధికారుల అంచనా.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర సరిహద్దుల్లోని తిప్పేశ్వర్‌, చంద్రపూర్‌ అడవుల్లో ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల నుంచి కొన్ని పులులు తప్పించుకుని ఉమ్మడి జిల్లాలో చొరబడ్డట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల వారికి పలు సందర్భాల్లో పులులు ఎదురైన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే గూడ రాంపూర్‌ గ్రామస్థులు తమ గ్రామ పరిధిలోనే రెండు పులులను చూడటం, తీసిన ఆ వీడియోలు వైరల్‌ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఈ నెల 17న 12.2 డిగ్రీలు, 18న 13.2 డిగ్రీలు, 19న 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో మరింత తగ్గుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అతిస్వల్పంగా నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. తాజాగా శనివారం ఆదిలాబాద్‌ మైదాన ప్రాంతంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవగా, అటవీ ప్రాంతంలో అది 7 నుంచి 8 డిగ్రీల వరకు పడిపోయి ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని కొండ ప్రాంతాలైన సిర్పూర్‌ యు, కెరమెరి, జైనూర్‌, నార్నూర్‌, తిర్యాని, వాంకిడి, ఆసిఫాబాద్‌, మండలాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. ఆయా మండలాల్లోని తాండాలు, గూడేల్లో నివసించే వారు ఇప్పటి నుంచే చలిమంటలు కాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

- Advertisement -

మైదాన ప్రాంతాల్లోను జనాలు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించకుండా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇదిలా ఉంటే రానున్నది రబీ సీజన్‌ కావడంతో రైతులు పంటలు వేసుకోవడానికి జంకుతున్నారు. చలిలో ఏదోవిధంగా పంట పొలాలకు వెళ్లి ఇన్నాళ్లు కాపలా కాసిన రైతులు ప్రస్తుతం పులుల సంచారం పెరిగిపోవడంతో వేసుకున్న పంటలను కాపాడుకుంటామా లేదా అనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో రబీ పంట విస్తీర్ణం 20 నుంచి 30 శాతానికి తగ్గిపోయే అవకాశాలున్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement