అస్సాంలో చిరుత పులుల గణన చేపట్టనున్నట్టు అక్కడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రోజు తెలిపింది. అస్సాంలో ఫస్ట్ టైమ్ చిరుత పులుల లెక్కింపు చేపట్టనున్నట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) సన్నీడియో చౌదరి తెలిపారు. అటవీ, అటవీయేతర ప్రాంతాల్లో చిరుతపులులు ఎన్ని ఉన్నయో అనే దానికి 24వారాల పాటు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కామ్రూప్ జిల్లాలోని అమిన్‌గావ్‌లో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందని, దాంతో పాటు నార్త్ కామ్రూప్ ఫారెస్ట్ డివిజన్లో కూడా ఎక్కువగానే వాటి ఉనికి ఉన్నట్టు తెలిపారు. కాగా ఈ కార్యక్రమం రేపటి నుంచి అంటే జనవరి 31వ తేదీనుంచే స్టార్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
అమిన్‌గావ్ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 50 కెమెరాలతో సిలా రిజర్వ్ ఫారెస్ట్, చాంగ్సారి, నైపర్, ఎయిమ్స్ తదితర ప్రాంతాల్లో కెమెరా ట్రాపింగ్లను ఏర్పాటు చేయనున్నారు. కెమెరా ట్రాపింగ్ 24 వారాల పాటు జరుగుతుందని, ప్రతి ఏడు రోజుల వ్యవధిలో ఒక్కో కెమెరా నుంచి డేటా సేకరించనున్నట్టు డీఎఫ్‌ఓ తెలిపారు. కెమెరా ట్రాప్‌లను ధ్రువీకరించడం.. మ్యాప్‌ల అధ్యయనం.. సీనియర్ అటవీ అధికారులతో చర్చలు, వలంటీర్ పార్టిసిపేషన్ ప్లాన్, ఫీల్డ్ సర్వే, టార్గెట్ లొకేషన్ సెలక్షన్ వంటివన్నీ దీనిలో భాగంగా ఉన్నాయన్నారు.
నార్త్ కామ్రూప్ ఫారెస్ట్ డివిజన్ ద్వారా అందరికీ అవగాహన కోసం వారం రోజులపాటు ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ చేపట్టునున్నట్టు డీఎఫ్‌ఓ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో డివిజన్‌లోని అధికారులు కెమెరా ట్రాపింగ్ మిషన్‌లోని వివిధ అంశాలను జిల్లా పరిపాలన, పోలీసు, గ్రామ, విద్యా సంస్థల అధిపతులు.. మీడియాతో సహా వివిధ వర్గాల వారితో వివరంగా చర్చిస్తాం.. అని సన్నీడియో చౌదరి చెప్పారు.
24 వారాల పాటు కెమెరా ట్రాపింగ్ సెన్సస్ జరపడం అస్సాంలో ఇదే మొదటిది. వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రాధాన్యతనిస్తూ మా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోంది. ఈ గణనలో కమ్రూప్ జిల్లా యంత్రాంగం పాల్గొంటుంది. నార్త్ కామ్రూప్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని 100 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ సర్వే చేపట్టాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది అని అస్సాం అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లాబైద్య తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందేనని.. అప్పుడే కెమెరా ట్రాపింగ్ ప్రారంభమవుతుందని అటవీ అధికారి తెలిపారు.