త్రివిధ దళాల స్పెషల్ ఆఫీసర్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంతో గతంలో జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాద ఘటనను అంతా యాది చేసుకుంటున్నారు. అప్పడు కూడా సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎత్తైన గుట్టలమీదుగా అటవీ ప్రాంతంలో వెళ్తుండగానే ప్రమాదానికి గురయ్యింది. ఇప్పుడూ అట్లానే బిపిన్ రావత్ అండ్ ఆర్మీ ఆఫీసర్ల టీమ్ వెళ్తున్న హెలికాప్టర్ కూడా కూనూరు ఫారెస్ట్‌లోని ఎత్తైన కొండలున్న అటవీ ప్రాంతంలోనే ప్రమాదానికి గురయ్యింది.. ఈ ప్రమాదంలో 11మంది చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా, సీడీసీ చీఫ్ రావత్‌కు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే.. చాలామంది అప్పట్లో జరిగిన వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద ఘటన గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు.. అప్పుడేం జరిగిందంటే..
2009 సెప్టెంబర్ 2వ తేదీ.. బుధవారం. సాధారణంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో లేరంటే సీ బ్లాకు వద్ద హడావుడి ఉండదు. కానీ, ఆరోజు మాత్రం 11 గంటలకే టెన్షన్ మొదలైంది. చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. కానీ, చేరుకోలేదు. హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని, సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ లభించడం లేదని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
మరికొద్దిసేపటికే కొన్ని చానెళ్లలో ముఖ్యమంత్రి క్షేమంగానే ఉన్నారని, రోడ్డు మార్గంలో చిత్తూరు వెళుతున్నారని స్క్రోలింగ్‌లు వచ్చాయి. అప్పటికే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్య, తదితర సీనియర్ మంత్రులు, చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి సహా ఉన్నతాధికారులు సచివాలయానికి చేరుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈలోపు సెక్రటేరియేట్ వద్ద ఉన్న జర్నలిస్టుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం వద్ద హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి, నల్లమల మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కాబట్టి వారేమైనా పేల్చేశారా? లేక ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశారా? వంటి ఊహాగానాలు వస్తున్నాయి. మధ్యాహ్నానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. హెలికాప్టర్ మిస్సయ్యిందని, ముఖ్యమంత్రి ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు చేప్టటామని. ఈ హెలికాప్టర్‌లో సీఎం రాజశేఖరరెడ్డితో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ కూడా ఉన్నారు.
అతిపెద్ద గాలింపు ఆపరేషన్..
ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించటం లేదన్న వార్త జాతీయ స్థాయిలో సంచలనమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలను అప్రమత్తం చేసి, గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పోలీసు, సీఆర్‌పీఎఫ్, యాంటీ నక్సల్ విభాగాల బలగాలు నల్లమల అడవుల్లోకి వెళ్లాయని, సికింద్రాబాద్, బెంగళూరుల నుంచి ఆర్మీ హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయని, థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న సుఖోయ్ విమానాన్ని కూడా పంపించామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతో హెలికాప్టర్లు వెనక్కు వచ్చేశాయి. ఇస్రో సైతం ఉపగ్రహ సాయంతో గాలింపు చర్యల్లో పాల్గొంటోందని ప్రభుత్వం తెలిపింది.
ముక్కలు ముక్కలుగా హెలికాప్టర్, శరీర భాగాలు..
హెలికాప్టర్ కూలిన ప్రదేశం కొండ శిఖరాగ్రం. హెలికాప్టర్ కొండను ఢీ కొట్టి ముక్కలయ్యింది. తోక భాగం ఒకచోట, రెక్కలు ఒకచోట, ఇంజిన్ మరొకచోట పడ్డాయి. మిగతావన్నీ ముక్కలు చెక్కలయ్యాయి. ఇంజిన్ కాలిపోయింది. ఇంజిన్‌కు సమీపంలోనే సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మృతదేహం పడింది. బట్టతల, పంచె ఆధారంగా ఆయన్ను గుర్తు పట్టినట్లు గ్రేహౌండ్స్ సిబ్బంది చెప్పారు.
తోకభాగం పడ్డచోట ఇద్దరు పైలట్లు, వారికి దూరంగా కుడివైపున భద్రతాధికారి వెస్లీ, వీరందరికీ కిందగా సుబ్రహ్మణ్యం మృతదేహాలు ఉన్నాయి. ఒక పైలట్ మృతదేహం సీటుకే ఉందని అధికారులు చెప్పారు. మరొక పైలట్ ముఖం దొరికిందన్నారు. గన్ ఉండటంతో వెస్లీని గుర్తించామన్నారు.