Friday, November 22, 2024

Big Story: రాజీనామాకు రెడీగా ఇమ్రాన్​.. బడ్జెట్‌ భేటీ తర్వాత ముందస్తు ఎన్నికలకు!

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పదవీ గండం తప్పేలా లేదు. ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జాతీయ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఇమ్రాన్‌కు ఆఖరి రోజు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా స్పీకర్‌ అసద్‌ కైసర్‌… సభను సోమవారానికి వాయిదా వేసి మరింత ఉత్కంఠ పెంచారు. ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం.. సోమవారం (రేపు) చర్చకు రానుంది. దీంతో ఖాన్‌కు కొంత ఊరట దక్కింది. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్‌ పాటిస్తున్న విధానాలే కారణమంటూ.. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)కి చెందిన సుమారు 100 మంది సభ్యులు 8వ తేదీన ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి ముందే తన ప్రజా బలాన్ని ప్రదర్శించుకునే పనిలో ఇమ్రాన్‌ పడ్డారు. అందుకు గాను నేడు ఇస్లామాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ వేదికపైనే ఇమ్రాన్‌ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బలపరుస్తున్న రషీద్‌ వ్యాఖ్యలు

పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకాలంటే.. ముందస్తు ఎన్నికలే మార్గమని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ చేసిన వ్యాఖ్యలు.. నేటి రాజీనామా అంశాన్ని బలపరుస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్‌ను కోరినట్టు రషీద్‌ వివరించాడు. 2022-23 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే.. ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఇమ్రాన్‌ ఉన్నట్టు సమాచారం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివర్లో జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ముందస్తుకు దారితీస్తున్నాయి.

మిత్రపక్షాల మద్దతుపై దృష్టి

అధికార పార్టీ పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన కనీసం 50 మంది మంత్రులు ప్రజల్లో కనిపించడం లేదు. వారంతా ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడంలేదని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. 50 మందిలో.. 25 మంది ఫెడరల్‌, ప్రావిన్షియల్‌ అడైజర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు కాగా.. నలుగురు రాష్ట్ర మంత్రులు. నలుగురు సలహాదారులు, 19 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు అని మీడియా తెలిపింది. ఇప్పటికీ మంత్రుల మద్దతును ఇమ్రాన్‌ పొందుతున్నారు. పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమద్‌ ఖురేషీ, సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరీ, ఇంధన మంత్రి మహ్మద్‌ అజర్‌, రక్షణ మంత్రి పరేజ్‌ ఖట్టక్‌, అంతర్గత వ్యవహారాల మంత్రి రషీద్‌లు ఇమ్రాన్‌కు మద్దతుగా ఉన్నారు. అధికార పార్టీ మిత్ర పక్షాలను తమవైపు తిప్పుకునేందుకు ఇమ్రాన్‌ ప్రయత్నిస్తున్నారు. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ పాకిస్తాన్‌తో ఇమ్రాన్‌ శనివారం భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement