హైదరాబాద్,ఆంధ్రప్రభ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికంటే.. కూడా దాని నెపంతో మన దగ్గర పెరుగుతున్న నూనెల ధరలకు, దీని వెనుక జరుగుతున్న కల్తీకి భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు అన్నింటా కల్తీ జరుగుతుండగా ఇంకా కొనసాగుతున్న యుద్ధంతో నూనెలు, పాలు, తినే తిండి మొత్తం కల్తీ మయంగా మారుతున్నాయి. వీధి వ్యాపారుల దగ్గర నుంచి స్టార్ హోటళ్లు వరకు వినియోగిస్తున్న నూనెలు నాణ్యమైనవేనా, కాదా అన్న అనుమానం వస్తోందిపుడు. ఇదిలా ఉండగా ఇప్పటికే కొంతమంది వ్యాపారులు అందవచ్చిన అవకాశంగా పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రాష్ట్రంలోని ఫుడ్ క్వాలిటిపై అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడంతోనే కల్తీ మాఫియా పెరుగుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
తనిఖీలు.. బుట్టదాఖలు..
రాష్ట్రంలో కొంతకాలంగా ఆహరానికి సంబంధించిన వాటిపై తనిఖీలు కొరవడ్డాయి. దీంతో కల్తీరాయుళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వాస్తవానికి ప్రతి నెలా జిల్లాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు జరిపాల్సి ఉండగా, ఎక్కడా పూర్తిస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో పాటు చర్యలూ అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఫిర్యాదులు వస్తేనే అధికారులు కదులుతున్నారు తప్ప.. స్వతహగా చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపించడంలేదని వినియోగదారులు చెబుతున్నారు.
తనిఖీల్లో ముఖ్యంగా మిస్ బ్రాండింగ్, తయారీ దారు వివరాలు, తయారీ తేదీలు లేని వాటితో పాటు అన్‌సేఫ్ (నిల్వ పదార్ధాలు)లను విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఆశించిన మేర చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. దీంతో తనిఖీలు, నిబంధనలు అన్నీ బుట్ట దాఖలవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
భద్రత కరువైతే. .ప్రజారోగ్యానికి ముప్పే..
ఆహారానికి భద్రత కరువైతే ప్రజాఆరోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే పలు నూనెలు, పాలు, చికెన్‌తో పాటు మసాలాలు, అల్లం పేస్ట్ లాంటి విక్రయదారులు స్థానికంగా ఎలాంటి నిబంధనలు లేకుండా ఇష్టారీతిన తయారుచేస్తూ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని సరిహద్దుల్లో ఇలాంటి వ్యాపారాలు జోరుగా నడుస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇప్పటికైనా అధికారులు ఆహారంపై తనిఖీలు చేపట్టి, ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని వినియోగదారులు కోరుతున్నారు.
పెరుగుతున్న నూనెల ధరలు..
యుద్ధం మొదలైనప్పటి నాటి నుంచి రోజురోజుకు నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.130 నుంచి 140 వరకు ఉండగా, ఇపుడు ఏకంగా రూ.176 వరకు పలుకుతుంది. ఇదే బాటలో పామాయిల్ కూడా పెరుగుతూ..మంగళవారం నాడు మార్కెట్లో లీటర్ రూ.155 నుంచి 157వరకు విక్రయాలు జరిగాయి. కాగా రైస్ బ్రాన్ ఆయిల్ రూ.158 నుంచి 159వరకు ధర పలికింది.
ఇదిలా ఉండగా యుద్ధం నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్‌కు ధర పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సాధారణ వినియోగంలో కొంతమేర ఈ ఆయిల్‌ను తగ్గించారని, దీని స్థానంలో పామాయిల్, రైస్ బ్రాన్, కాటన్ సీడ్ ఆయిల్‌ను వాడేందుకు మొగ్గుచూపుతున్నారని విజయ ఆయిల్ కార్పోరేషన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వారం క్రితం వరకు సన్‌ఫ్లవర్‌కు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గడంతో ధర కొంతమేర స్థిరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
అర్జెంటీనా ఆయిల్‌కు ఆలస్యం.. ఉక్రెయిన్ నుంచి నిలిచిన నూనెలు..
యుద్ధం నేపథ్యంలో అత్యధికంగా మనకు నూనెలను ఎగుమతి చేసే ఉక్రెయిన్ నుంచి రావాల్సిన సరుకు రవాణా నిలిచిపోయింది. ఈ మేరకు పోర్టులకు కూడా ఓడలు రావడంలేదని అధికారులు తెలిపారు. కాగా అర్జెంటీనా నుంచి రావాల్సిన సరుకు ఆలస్యం అవుతుందని, సుమారు 45రోజుల సమయం పడుతుంది. అదే ఉక్రెయిన్ నుంచి సరుకు రావడానికి 20 నుంచి 25రోజులు మాత్రమే పడుతుంది.
ఇండోనేషియా, మలేషియా నుంచి 10 నుంచి 15రోజుల్లోనే సరుకు వచ్చే అవకాశం ఉన్నా.. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునేది చాలా తక్కువ ఉండడంతో నూనెల దిగుమతులకు ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం దేశం వినియోగిస్తున్న నూనెల్లో సుమారు 70శాతం మనకు ఉక్రెయిన్ నుంచే వస్తుండగా, ఇందులో అర్జెంటీనా నుంచి 20వేల టన్నులు సన్ ఫ్లవర్, ఇతర ఆయిల్స్, ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. కాగా తెలంగాణ అవసరాలకు రోజుకు సుమారు 2,500 టన్నులు అవసరం పడుతుండగా, నెలకు 75వేల టన్నులు అవసరం పడనున్నాయి. ఈనేపథ్యంలో యుద్ధం ఇంకా కొనసాగితే భవిష్యత్‌లో నూనెలకు ధరలు మరింత పెరగడంతో పాటు నిల్వలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. కాగా అర్జెంటీనా, మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్, సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్, కాటన్ సీడ్ ఆయిల్స్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం.