కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో ఆ పార్టీ కీలక నేతల భేటీ ఇవ్వాల జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సరళి, ఓటింగ్ శాతంతో పాటు ఫలితాల తర్వాత ఏర్పడే పరిస్థితులపై కూడా ఈ భేటీలో ఓ అంచనాకు వచ్చామని సీఎం భూపేశ్ బాఘేల్ తెలిపారు. ఇక రాజస్థాన్ సీఎం గెహ్లోత్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించే విస్తృతంగా చర్చించామని తెలిపారు. దేశంలో ప్రతిపక్ష పార్టీ అంటే ఒక్క కాంగ్రెస్సేనని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక డిసెంబర్ లో ఉంటుందని గెహ్లోత్ తెలిపారు. డిసెంబర్ లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎంపిక చేపట్టాలన్న నిర్ణయం కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఐదు రాష్ట్రాల కార్యకర్తలు, నేతలు అత్యంత అప్రమత్తతో ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సూచించినట్లు సమాచారం. కౌంటింగ్ సెంటర్ల దగ్గర కార్యకర్తలు మరింత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పార్టీ బాధ్యులందరూ ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని పర్యవేక్షిస్తూ ఉండాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.