హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే నెల నుంచి 9 జిల్లాల్లో అమలుచేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లిdలో వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ కిట్ అమలు, ఫలితాలపై సభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ఈ పథకాన్ని మొదటగా రక్త హీనత, పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అమలు చేయబోతున్నామన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఏప్రిల్ నుంచి అమలుచేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్‌పై స్పందిస్తూ.. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుండి 56 శాతానికి పెరిగిందన్నారు. దీన్ని 2014 తర్వాత 26 శాతం పెంచుకోగలిగామన్నారు. కేసీఆర్ కిట్ 2017 జూన్ 2 నుంచి ప్రారంభమైందని, ఇప్పటివరకు 13.29 లక్షల మంది లబ్దిపొందగా, రూ. 1387 కోట్లు- ఖర్చు చేశామన్నారు. కాగా రూ. 407 కోట్లతో 22 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు- చేశామన్నారు. అందులో ఇప్పటివరకు 16 పూర్తి కాగా, మరో 8 ఏర్పాటు- దశలో ఉన్నాయన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, చిన్న పిల్లల ఐసీయూ, మెటర్నల్ ఐసీయూలను ఏర్పాటు- చేశామన్నారు.
రాష్ట్రంలో తగ్గిన మాతా, శిశు మరణాల రేటు..
మాతా శిశు సంరక్షణ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. 2014లో ప్రసూతి మరణాల రేటు 92 శాతం ఉంటే, ఇపుడు దాన్ని 63శాతానికి తగ్గించుకోగలిగామన్నారు. దీంతో పాటు శిశు మరణాల రేటు సైతం 39 శాతం నుండి 23శాతానికి తగ్గిందన్నారు. పిల్లల వ్యాక్సినేషన్ 68 శాతం నుండి 100 శాతానికి పెరిగిందన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వడంతో పాటు గర్భిణిలు ఆరోగ్యంగా ఉండేందుకు గాను కేసీఆర్ కిట్‌తో పాటు ఇస్తున్న 12, 13వేల రూపాయలను విడతల వారీగా ఇస్తున్నట్టు తెలిపారు. గర్భం దాల్చిన సమయం నుంచి పుట్టిన బిడ్డకు రెండుసార్లు వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు వారికి పథకం ద్వారా అందే పూర్తి నగదు అందుతుందన్నారు.
సిజేరియన్లు తగ్గుతున్నయ్..
రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గుతున్నాయని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. అయితే దీన్ని మరింత తగ్గించేందుకు సభ్యులూ, ప్రజాప్రతినిధులు అందరూ కృషిచేయాలని, సాధారణ ప్రసవాల పట్ల మహిళలకు అవగాహన పెంచాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం మాత్రమే సిజేరియన్లు ఉంటాయన్నారు. మన దగ్గర సీ సెక్షన్ కేసీఆర్ కిట్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 శాతం సాధారణ డెలివరీలు చేస్తున్నారు. దాన్ని 75 శాతానికి తీసుకెళ్లాలని కోరుతున్నామన్నారు. ప్రైవేట్‌లో 78 శాతం సీ సెక్షన్ ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్‌లో అధికంగా జరుగుతున్న సిజేరియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించామన్నారు. అక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని తెలిపామన్నారు.