Saturday, November 23, 2024

అల్లోపతి వైద్యంపై నోరుజారిన బాబా రాందేవ్‌కు IMA నోటీసులు

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అల్లోపతి వైద్యంపై నోరు జారి చిక్కుల్లో పడ్డారు. కరోనా నేపథ్యంలో ఏ మందు పని చేస్తుంది.. ఏ మందు పని చేయటం లేదనే వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఆనందయ్య పసరు మందు వివాదం రేపుతున్న ఈ సందర్భంలో రాందేవ్ బాబా అల్లోపతి వైద్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడటం వివాదాస్పదమైంది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీరియస్ కావడంతో ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని లీగల్ నోటీసులో పేర్కొంది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని బాబా రాందేవ్ చెబుతున్నారంటూ అంతకుముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఐఎంఏ తీవ్రంగా విమర్శించింది. అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా రాందేవ్ బాబా మాట్లాడారని ఐఎంఏ పేర్కొంది. రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాందేవ్‌పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్ని అయినా రద్దు చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది. రాందేవ్‌పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఇండియన్ మెడికల్ సోసియేషన్ హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement