Tuesday, November 26, 2024

నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు.. శీల‌ప‌రీక్ష చేసుకోవ‌డానికి అగ్నిగుండంలో దూక‌ల్నా?

కాంగ్రెస్ నాయకులను పంపించి తెలంగాణ ఆఫీస్‌ని ఖాళీ చేద్దామనుకుంటున్నారా? అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మా కాంట్రిబ్యూషన్ ఉంది.పార్టీ నుంచి మమ్మల్ని వెళ్లగొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కాంగ్రెస్ నుంచి అందరినీ పంపించి పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం ఎవరి కుట్ర? అని మండిప‌డ్డారు. తాను హనేస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ కోసం చెమట, రక్తాన్ని దారపోస్తున్నాన‌ని, ఏనాడూ పదవి అడగలేదన్నారు.

తానో సామాన్య కార్యకర్తన‌ని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. ప్రతిసారి శీల పరీక్ష చేసుకోవడానికి అగ్నిగుండంలో దూకల్నా అని మండిపడ్డారు. కావాల‌నే త‌న‌పై బుర‌ద‌చ‌ల్లుతున్నార‌ని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. ‘‘నన్ను కావాలనే బద్నాం చేస్తున్నారు. ప్రతిసారీ మాపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌లోని కొందరికి మంచిది కాదు. పార్టీలోని కొందరే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. నేను ఢిల్లీ వెళ్లి అమిత్‌షా ని గాని ఇంకా ఎవరినైనా కలిశానా? ఈ విషయంపై ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలి. రామారావు పటేల్ పార్టీ నుంచి వెళ్లిపోతే నాకు ఏం సంబంధం? రామారావు పటేల్ వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్లారు. ఆయనను ఆపడానికి నేను అన్ని ప్రయత్నాలు చేశా.రామారావు పటేల్‌కి టికెట్ ఇప్పించింది జానారెడ్డి గతంలో హరిప్రియకి, సోయం బాబురావులకి రేవంత్‌రెడ్డి టికెట్ ఇప్పించారు. వాళ్లు కూడా పార్టీ మారారు. దానికి రేవంత్ బాధ్యత వహించాలా? బొత్స, పొన్నాల, ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఈటల, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి‌లను కలిసిన వాళ్లకి కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదు’’ అని మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement