Wednesday, November 20, 2024

Big Story: అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ – పారిశ్రామిక ప్రాంతాల్లో అడ్డు అదుపులేని దందా..

జిన్నారం, (ప్రభ న్యూస్):  ఖజానా నింపేందుకు సర్కారు అన్ని దారులను అన్వేషిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణలోని పటాన్ చెరు నియోజకవర్గంలో అడ్డు, అదుపు లేకుండా యథేచ్ఛగా అక్రమ గ్యాస్ దందా కొనసాగుతోంది. ఇది అధికారులు అండతోనే జరుగుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. జనావాసాల మధ్య నిర్భయంగా అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

పటాన్ చెరు, పాశమైలారం, బొల్లారం పారిశ్రామికవాడలో గ్యాస్ సిలిండర్ల  అక్రమ వ్యాపారం రోజురోజేకూ పెరుగుతోంది. ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో రోడ్లమీదే వెల్డింగ్ పనులకు, హోటళ్లలో, తదితర అవసరాలకు వినియోగిస్తున్నా.. అధికారులు మాత్రం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యకరం. ఏడాదిపాటు అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినా తీరుమారడం లేదు. గ్యాస్ అక్రమ దందా రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని తనిఖీల్లో బయట పడుతుంది. పట్టణాలతోపాటు వివిధ గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయనే విమర్శలున్నాయి. దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి: గురువాయూర్ ఆలయంలోకి ప్రసిద్ధ గాయకుడు ఏసుదాస్ కు ప్ర‌వేశం లేదా?

- Advertisement -

జనావాసాల మధ్య అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తూ అక్రమార్కులు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. నియోజవర్గంలో విచ్చల విడిగా రోడ్ల మీద, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో గృహావసర సిలిండర్లను వాడుతున్నారు. పక్కా సమయానికి గ్యాస్ ఇవ్వడం లేదని ప్రజలు ఏజెన్సీల వద్ద మొరపెట్టుకుంటే.. మరోపక్క అదే గ్యాస్‌ను చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సివిల్ సప్లై అధికారులు  నిర్వహించిన దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న  సిలిండర్లు పట్టుబడ్డ మళ్లీ కథ మొదటికే చేరుతుంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కుల ఆట కట్టించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. లేదంటే అమాయక ప్రజల ప్రాణాలు అమాంతం గాల్లోకి కలిసి పోయే ప్రమాదం పొంచి ఉందనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement