Tuesday, November 26, 2024

యువ‌తి హ‌త్య కేసులో – బిజెపి నేత రిసార్ట్ కూల్చివేత‌

యువ‌తి హ‌త్య కేసులో బిజెపి నేత రిసార్ట్ ని కూల్చివేశారు. ఉత్త‌రాఖండ్ లో 19ఏళ్ల యువ‌తి హ‌త్య క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్యతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు మూలకేంద్రమైన పుల్కిత్ ఆర్య రిసార్ట్ ను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరిస్థితి మరీ చేయిజారిపోకముందే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పుష్కర్ ధామి రిసార్ట్ ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి.

రిషికేష్ లోని పుల్కిత్ కు చెందిన వనతారా రిసార్ట్ బుల్డోజర్లతో కుప్ప కూల్చాయి. ఈ కూల్చివేత.. నేరం చేయాలనుకునేవాళ్లకు భయం పుట్టిస్తోందని యమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిష్ట్ చెప్తున్నారు. ఈ ఘటనలో వెంటనే చర్యలకు ఆదేశంచిన సీఎం ధామికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు.. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం ధామి స్పందిస్తూ.. ఈ సంఘ‌ట‌న దురదృష్టకరం అన్నారు. అయితే, పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా చేధించారని, నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. నేరస్తులు ఎలాంటి వారైనా కఠిన చర్యలు కచ్చితంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. హరిద్వార్ కు చెందిన బీజేపీ నేత వినోద్ ఆర్య.. ఉత్తరాఖండ్ మతి కళాబోర్డుకు గతంలో చైర్మన్ గా కూడా పని చేశారు. ఈయన కొడుకే పుల్కిత్ ఆర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement