అతని పేరు రమేశ్‌గౌడ్ (పేరు మార్చాం).. సొంతూరు నిజామాబాద్‌లోని ఓ పల్లెటూరు. పెద్ద చదువులు చదివి హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చాడు. వారిది మధ్య తరగతి కుటుంబం. ఇక.. హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ ఏరియాలోని రిలయన్స్ స్టోర్‌లో తొలుత చిన్నపాటి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతని పనితీరు, కమిట్‌మెంట్, డెడికేసన్‌ని మెచ్చిన యాజమాన్యం ఏడాది కాలంలోనే డిపార్ట్‌మెంటల్ మేనేజర్‌గా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో అతని సంతోషానికి అవధులు లేవు. కానీ, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. డిపార్ట్‌మెంటల్ మేనేజర్ (డీఎం) అయిన తర్వాత ఆ స్టోర్ మేనేజర్ (ఎస్ఎం) నుంచి సూటిపోటి మాటలు, టైమ్ మేనేజ్‌మెంట్ పరంగా ఒత్తిళ్లు మొదలయ్యాయి. బిజినెస్ దెబ్బతింటోందని, గేటు ముందు మనుషులను పెట్టి వస్తువులను అమ్మించాలన్న రూల్స్ వచ్చాయి.
అంతేకాకుండా వెజిటెబుల్స్ అమ్ముడుపోకపోవడంతో బయట షాపులకు, హాస్టల్స్‌కి వెళ్లి మాట్లాడి అమ్మకాలు జరిగేలా చూడాలన్న కండిషన్స్ పెరిగాయి. ఇట్లా రోజూ మానసిక వేదనలు అనుభవించిన తను ఇప్పుడు మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడు. కనీసం సొంత మనుషులనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. దీంతో అతని ఉద్యోగం ఊడింది.. మంచానపడ్డ కొడుకు ఆరోగ్యం బాగు కోసం తల్లిదండ్రులు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.. ఇట్లాంటి యువతీ, యువకులు ఎంతోమంది రిలయన్స్ మాల్స్, స్టోర్స్ దెబ్బకు ఇరవై ఏళ్లలోనే సడుగులిరిగి లేవలేని పరిస్థితి దాపురిస్తోంది.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
రిలయన్స్ స్టోర్స్.. ఉపాధి వేటలో ఉన్న యువతకు అదో ఆశల సౌధం. కొంతమంది నిరుపేదలకు చదువు కొనసాగిస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫుల్ టైమ్‌లోనూ ఇంకొంతమంది జాబ్ చేస్తుంటారు. నెలకు దాదాపు 9వేల నుంచి వేతనం. ఇంకేముంది అనుకుంటున్నారు కదూ.. ఇక్కడే ఉంది అసలు కిటుకు.. జాబ్ పేరుతో అక్కడ జాయిన్ అయ్యారో, ఇక మీ నడ్డీ విరిగినట్టే. ఎందుకంటే మూటలు, ముల్లెలు మోయిస్తూ.. 20 ఏళ్ల యువ కిశోరాలను పీనుగుల్లా మార్చేస్తున్నారు అక్కడ. ఇక జీతం సంగతి దేవుడెరుగు.. జీవితాంతం ఆనారోగ్యంతో మంచంపట్టాల్సిందే అంటున్నారు కొంతమంది బాధితులు..
హైదరాబాద్ మహానగరం అంటే నిరుపేదలకు, సంపన్నులకు నిలయం. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందేవారికి కొదువలేదు. అట్లాగే.. దేశానికి ద్వితీయ రాజధానిగా విశ్వవ్యాప్తంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు దాని చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వరంగల్ వంటి దూర ప్రాంత జిల్లాల నుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. అయితే, అందరినీ కడుపులో పెట్టుకుని చల్లగా చూసుకునే భాగ్యనగరంలో కొంతమంది అభాగ్యులు అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. ఎన్నో ఆశలతో ఇంటిల్లిపాదిని వదిలేసి సిటీకి వస్తే.. ఇక్కడ రిలయన్స్ వంటి స్మార్ట్ మాల్స్ పనిపేరుతో వారి ఆయుష్సుని హరిస్తున్నాయి. వందలాది మంది యువతీ యువకులు రిలయన్స్ వంటి కంపెనీల మోసానికి బలవుతున్నారు.
అయితే.. రిలయన్స్‌లో పనిచేస్తున్న వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే ఆ కంపెనీ బాధ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా, ఖర్చుకు వెనకాడుతూ కొంతమంది మేనేజర్లు ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి ఉదాహరణగా ఈ మధ్యనే హైదరాబాద్ బండ్లగూడ రిలయన్స్ స్టోర్‌లో ఉద్యోగం మానేసిన వారిలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ కంపెనీ తీరుపై మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ విలేజ్ నుంచి ఈ స్టోర్‌కి రాకపోకలు సాగించే యువకులు కొంతమంది పనిలో చేరిన కొద్ది రోజులకే మానేశారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే.. వయసుకు మించిన పనులు, బరువులు ఎత్తడంతో వారి వెన్నెముక దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. మరో వ్యక్తి పెద్ద పెద్ద బియ్యం మూటలు, బరువులు మోయడంతో స్పాండలైటిస్ వంటి సమస్యలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఇక అప్పటి నుంచి వారు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేయించుకున్న కంపెనీ బాధ్యులు వారు అనారోగ్యం బారిన పడడంతో ముఖం చాటేసినట్టు తెలుస్తోంది.
మరి ఇట్లాంటి ఆగడాలపై ఫిర్యాదులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ కంపెనీ బాగోతాలు ఇష్టమున్నట్టు సాగుతున్నాయని.. పోతే పోయింది ఇప్పటికైనా మనం సేఫ్ అనుకునే యువతీ, యువకులకు ఆ పని అశనిపాతంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఇట్లాంటి విపరీత పోకడలు పోతున్న రిలయన్స్ స్టోర్స్ మేనేజర్లపై.. అక్కడ పనిదోపిడీకి పాల్పడుతున్న తీరుపైనా లేబర్ డిపార్ట్‌మెంట్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ దృష్టి సారిస్తే ఇకముందైనా అట్లాంటి చోట జాబ్‌లో చేరే యువతకు మేలు చేసిన వారవుతారు. అంతేకాకుండా ఇట్లాంటి బాధితుల జాబితా తీసుకుని వారికి రిలయన్స్ కంపెనీ ద్వారానే నష్టపరిహారంతోపాటు వారి అరోగ్యం పూర్తిగా నయమయ్యే దాకా బాధ్యత తీసుకునేలా చేయాలని చాలామంది కోరుతున్నారు.