హైదరాబాద్, ఆంధ్రప్రభ : నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు యాజమాన్యం, కార్మికులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే భారమంతా తమ మీదే అన్నట్లుగా కొంత మంది అధికారులు అతిగా నటిస్తుండటం సంస్థ ప్రతిష్టను దిగజారుస్తోంది. కొంత మంది అధికారులు కార్మికులంటే కట్టుబానిసలన్నట్లుగా ప్రవర్తిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. అధికారుల వేధింపులను తట్టుకోలేక ఇప్పటికే నలుగురు ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తమ మరణానికి అధికారుల వేధింపులే కారణమన్న లేఖలు కూడా దొరికాయి. అయితే అధికారులు సదరు అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్న అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కార్మికులను రోజురోజుకూ మనో వేధనకు గురి చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన డ్రైవర్ ఒకరు తమ సమీప బంధువు మరణించాడని, అంత్యక్రియలకు వెళ్ళాలంటూ సెలవు కావాలని పై అధికారులను కోరాడు. ఈ విషయాన్ని మానవత్వంతో చూడాల్సిన సదరు అధికారి సెలవు కావాలంటే డెబ్‌బాడీతో సెల్ఫీ దిగి పంపించమని చెప్పాడు.
ప్రస్తుతం ఈ అంశంపై ఆర్టీసీ కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు రోజుకో డిపోలో జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. సంస్థను గట్టెక్కించాలన్న తమన అధికారుల కంటే తమలోనే అధికంగా ఉందని, నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ సమయం విధులను నిర్వహిస్తున్నామని, అయినా అధికారులు తమను ఎఫిషియన్సీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తమ పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరును వివరిస్తూ ఫెస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు సదరు డ్రైవర్‌ను ఏకంగా ఉద్యోగంలో నుంచి తొలగించారు. పోస్ట్ చేసిన విషయాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, ఏసీ గదులలో కూర్చునే అధికారులు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది పట్ల ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలను మాత్రమే తెలిపానని మొర పెట్టుకున్నప్పటికీ వినే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఆ డ్రైవర్ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివాదాస్పదమవుతున్న అధికారుల తీరు
వాస్తవానికి సంస్థలో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది కంటే అధికారులు అధికంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో అధికారికి సంస్థ చెల్లిస్తున్న వేతనంలో 10 మంది డ్రైవర్, కండక్టర్‌లకు చెల్లించవచ్చని అంటున్నారు. ఏసీ గదులు దాటి రాని అధికారులు ప్రజల్లో సంస్థ పట్ల ఉన్న అభిప్రాయం, సంస్థ నుంచి వారు ఏం కోరుకుంటున్నారనేది తెలియదని, ఇదే విషయాన్ని ఎప్పుడో ఒకప్పుడు అధికారులకు చెప్పేందుకు ప్రయత్నిస్తే క్రమశిక్షణ కింద చార్జీ మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించిన సజ్జనార్ ఇప్పుడు కార్మికులను కలిసేందుకు ఇష్టపడటం లేదంటున్నారు.