Sunday, November 24, 2024

Big Story: ఆ నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండాలే.. భ‌గ్గుమంటున్న ఎండ‌లు

ఉమ్మడిరంగారెడ్డి, (ప్రభన్యూస్ బ్యూరో) : ఎండల తీవ్రత పెరిగింది.. ఉదయం తొమ్మిది గంటలనుండే సూర్యుడుతన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్ల సమయాన్నికూడా మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8గంటలనుండి 11.30గంటల వరకే స్కూళ్లు కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎండలనుండి తప్పించుకోవాలంటే నాలుగు గంటలపాటు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సి న పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 12గంటలనుండి సాయంత్రం 4 గంటల మధ్యలో అంటే నాలుగు గంటలపాటు ఇళ్లనుండి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ఎండలకు తోడు ఉక్కపోత ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోంది. ఏప్రిల్‌ మాసంలో పరిస్థితులు ఇలా ఉంటే ఇక మే మాసంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది….

ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు..ఏమాత్రం విరామం లేకుండా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగుగంటలపాటు ఇళ్లనుండి బయటకు రాకూడదని స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలనుండి సాయంత్రం నాలుగు వరకు ఎండల తీవ్రత ఎక్కువే. ఆ సమయంలో బయటకు వచ్చే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే. ఆ సమయాల్లో బయటకు రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటే మాత్రం మధ్యాహ్నం 12 లోపే వెళ్లి వచ్చేలా ప్లానింగ్‌ చేసుకోవాలి…లేకుంటే సాయంత్రం నాలుగు తరువాత ప్రయాణాలు పెట్టుకోవాలి. ఇప్పటికే ఎండ 40 డిగ్రీలు దాటిపోయింది. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే మే మాసాల్లో ఇంకా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ రెండు మాసాలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా సూచన చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో పరిస్థితులను బట్టి బయటకు
రావాలని స్పష్టమైన సూచన చేస్తున్నారు.

వృద్ధులు…పిల్లలు జాగ్రత్త..
ఎండలు తీవ్రమైన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు 40 డిగ్రీలు దాటిపోయినందునా వృద్ధులు, పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో వీరిని బయటకు తీసుకెళ్లడం ఇబ్బందే. ప్లానింగ్‌ లేకుండా వృద్ధులను, పిల్లలను బయటకు తీసుకెళ్తే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీరిపై ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మిగతా వయస్సు వాళ్లు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ వృద్ధులు, పిల్లలు తప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలామంది ఎండకాలంలో వీరిని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఏమి కాదనే ధీమాతో ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వచ్చి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు…

వడ దెబ్బ తగిలితే…
మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బయటకు వస్తే వడ దెబ్బ తగిలే ప్రమాదం నెలకొంది. ఆ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇళ్లనుండి బయటకు వస్తే వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఒకవేళ వడదెబ్బ తగిలితే వెంటనే తెలిసిపోతుంది. లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే బయట పడ్డట్లే. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. వడబెద్ద తగిలిన వారికి చెమటలు రావు…నాలుగు తడారిపోతుంది..పెదాలు పగిలిపోతాయి…శరీరం పూర్తిగా పట్టుకోల్పోతుంది. తలనొప్పి ఎక్కువగా రావడం…వికారంగా ఉంటే మాత్రం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి…డాక్టర్ల సూచన
మేరకు వైద్యం చేయించుకోవాలి.. ఆసమయంలో రెస్టు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement