Friday, November 22, 2024

దమ్ముంటే రండి, నన్ను జైలుకు పంపండి.. పీయూష్ గోయల్ కాదు, గోల్‌మాల్ : కేసీఆర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజా కొనాల్సిందేన‌ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష సాక్షిగా కేంద్రంపై పోరుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సై అన్నారు. ధాన్యం సేకరణలో 24 గంటల్లో మీ నిర్ణయం చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే ఏం ఏం చేయాలో చేసి చూపిస్తామని ఉద్ఘాటించారు. దీక్ష ప్రారంభమయ్యాక 11 గంటల సమయంలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా భవన్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం జ్యోతిబా పూలే ఫొటోకు నివాళులర్పించారు. 12.10 గంటల సమయంలో ఆయన ప్రసంగం ప్రారంభమైంది. ఎవరితోనైనా గొడవ పడవచ్చు కానీ రైతులతో పెట్టుకోవద్దంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్రం వడ్లు కొనాలంటూ తెలంగాణా ప్రజాప్రతినిధులు సుమారు 2 వేల కిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో తెలంగాణ మంత్రిమండలి, రైతులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది? తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరన్న ముఖ్యమంత్రి, “నిన్ను గద్దె దించే సత్తా రైతులకు ఉంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హెచ్చరిస్తున్నానన్నారు. 

ధర్మబద్ధమైన డిమాండ్‌తో వస్తే అవమానించారు 
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారని గుర్తు చేశారు. ధర్మబద్ధమైన డిమాండుతో మేము వస్తే, ఆయన ఇలా అవమానించారని మండిపడ్డారు. మేము పీయూష్ గోయల్‌ను అడుక్కోవడానికి రాలేదన్న కేసీఆర్, గోయల్ ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఆయన పీయూష్ గోయల్ కాదు – పీయూష్ గోల్‌మాల్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అప్పట్లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో తెలంగాణలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణలో 30 లక్షల బోర్ బావులు ఉన్నాయని, వాటిపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాల్సి వస్తోందని వాపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం 20 లక్షల మంది కార్మికులు దేశంలో నలుమూలలకు వెళ్లారని, 1956 నుంచి మొదలుపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చామని కేసీఆర్ చరిత్రను గుర్తు చేశారు. అనేక పోరాటాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆనాటి సంగతులను చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే వ్యవసాయానికే అత్యున్నత ప్రాధాన్యతనిచ్చామని, మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెంచి, వ్యవసాయానికి ఊతమిచ్చేలా చేశామని వివరించారు. అప్పటికి విద్యుత్తు పెద్ద సమస్యగా ఉండేదని, కానీ ఇప్పుడు రైతులకు 24 గంటలూ విద్యుత్తు పవర్ కట్ లేకుండా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 1 కోటి ఎకరాల అదనపు భూమిని సాగులోకి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. దీనికి ప్రశంసించాల్సింది పోయి, మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

బిచ్చం అడగట్లేదు-హక్కులు అడుగుతున్నాం
ప్రధానమంత్రి మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఈ దేశ రైతులు బిచ్చం అడగడం లేదు, హక్కులు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ విధానం రూపొందిస్తే మేం కూడా మీకు సహకరిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. లేదంటే మిమ్మల్ని గద్దె దించి, మేమే కొత్త పాలసీ తయారు చేసుకుంటామని సవాల్ విసిరారు. పంట మార్పిడి చేయమని కేంద్రం చెబితే, తాము గ్రామ గ్రామానికి, ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పామని వెల్లడించారు. కానీ వాళ్ల పార్టీకే చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “మీరు వరి వేయండి. ప్రతి గింజా మేం కొంటాం” అన్నారని కేసీఆర్ మండిపడ్డారు. అప్పట్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడిన వీడియోను సభా ప్రాంగణంలో ప్లే చేసి చూపించారు. అనంతరం కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… టీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఇక్కడ ధర్నా చేస్తుంటే, బీజేపీ నేతలు అక్కడ హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. వాళ్లకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో వారు ధర్నా చేస్తున్నారో చెప్పాలన్నారు. 

మీ దగ్గర డబ్బు లేదా? మనసు లేదా?
రైతుల విషయంలో తాడో పేడో తేల్చుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణా ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తెలంగాణా ప్రభుత్వం రైతులను గంగలో ముంచేంత బలహీనమైందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా – మనసు లేదా అని ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టికాయత్‌ను ఎన్నో విధాలుగా అవమానించారని, దేశద్రోహి, ముఖ్యమంత్రి అన్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తామంతా రాకేశ్ టికాయత్ పోరాటానికి మద్ధతిస్తున్నామని, తెలంగాణా ప్రజానీకం ఆయన వెంట ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. 

నియంతలే మట్టిలో కలిశారు-మీరెంత?
దేశంలో మేం సృష్టించే భూకంపానికి పీయూష్ గోల్‌మాల్ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. హిట్లర్, ముస్సోలిన్, నెపోలియన్ వంటి ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారు. ఇక మీరెంత అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి ఎదురు తిరిగితే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? ఈడీ, సీబీఐ ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవంటూ ఎద్దేవా చేశారు. నన్ను జైలుకు పంపుతామంటున్నారు. దమ్ముంటే రమ్మనండి… నన్ను జైలుకు పంపమనండి అంటూ సవాల్ విసిరారు. 

- Advertisement -

త్వరలో మా నిర్ణయం చెప్తాం
రాష్ట్రంలో ఉన్న చోటా మోటా కుక్కలు మొరుగుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఎంతో చేశాం, ఇప్పుడు దేశం కోసం చేస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండాలని నొక్కి చెప్పారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్ల మీదికి వస్తారని హెచ్చరించారు. నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్‌కు రెండు చేతులూ జోడించి కోరుతున్నా, మిగతా దేశంలో ఎలా ధాన్యం కొంటున్నారో.. మా దగ్గర కూడా అలాగే ధాన్యం కొనండంటూ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మా వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మా ధాన్యం ప్రధాని కొంటే సరి. కొనకపోయినా ఫర్వాలేదన్నారు. మేమంత పేదవాళ్లమేమీ కాదు, రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ భరోసానిచ్చారు. వైద్య పరీక్షలు, పంటి చికిత్స తర్వాత నిరసన దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 9 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement