టాటా ఐపీఎల్2022.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఆడుతోంది. ఈజీగా గెలవాల్సిన కొన్ని మ్యాచ్ లు దురదృష్టంతో ఓటమిపాలు అవుతోంది. ఇటువంటి సమయంలో ప్రత్యర్థులు రెచ్చిపోయి ప్రవర్తిస్తే ఎట్లుంటది. అదే సీన్ ఆదివారం నాటి మ్యాచ్‌లో జరిగింది. ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 36 రన్స్ తేడాతో లక్నో గెలిచింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను ఔట్ చేశాడు. ఇక ముంబై టార్గెట్ చేజింగ్ చేస్తున్న క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు.
అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. స్నేహితుడే కదా అని ఇష్టమున్నట్టు ప్రవర్తించడం అంత మంచిది కాదు. ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులే కానీ.. ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయన్నాడు. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటప్పుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో స్నేహితులతో ఏడాదంతా సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది అని కృనాల్ తీరును తప్పుబట్టాడు.
మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయగలం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది అని ప్రశ్నించాడు. తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడిన విషయం తెలిసిందే.