Wednesday, November 20, 2024

Exclusive – కృత్రిమ మేధ విశ్వ‌రూపం – క‌ట్ట‌డి చేయ‌క‌పోతే క‌ల్లోల‌మే ..

న్యూఢిల్లీ – ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి –
చైనాలో సంస్కరణలు వేగంగా అమలౌతున్న దశలో… 1979లో ఆ దేశాధ్యక్షుడు బెంగ్‌ జియాఓ పింగ్‌ సోనీ సంస్థ సహ వ్యవస్థాపకుడు, అప్పటి జపనీస్‌ వ్యాపార దిగ్గజం అకియో మోరిటాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చైనాకు రోబోటిక్‌ అటోమేషన్‌ ప్రక్రియలో సహాయం చేయమని బెంగ్‌ మోరిటా ను కోరారు. ఇది చైనా వంటి విస్తార మైన జనాభాతో కూడిన పెద్ద దేశానికి సరైన నిర్ణయం కాదంటూ మోరిటా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. తయారీ, ఇతర రంగాల్లో అం దుబాటులో ఉన్న కార్మికుల్ని వినియోగించుకోవడం ద్వారా చైనా ఉత్తమ ఫలితాల్ని సాధిస్తుందని సలహానిచ్చారు. ఆటోమేషన్‌ను గుడ్డిగా అనుసరించొద్దంటూ కూడా సూచించారు.
అమెరికాకు చెందిన మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఇటీవల జెనరేటీవ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ఇన్‌ అమెరికా పేరిట నిర్వహించిన అధ్యయనంలో 2030నాటికి అమెరికా ఉపాధి రంగంపై కుత్రిమ మేథ గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని వెల్లడించారు. ఆటోమేషన్‌ డేటా సేకరణ, రీసైక్లింగ్‌ పనుల్ని భవిష్యత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేస్తుంది. 2030నాటికి ఒక్క అమెరికాలోనే 12 మిలియన్ల మంది తమ ఉద్యోగాల్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా కోల్పోవాల్సొస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.

వార్తా కథనాల్ని రూపొందించి వీక్షకులకు సోదాహరణంగా వివరించడంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం గూగుల్‌ గత రెండేళ్ళుగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈలోగా భారతీయ వార్తా ఛానళ్ళు గూగుల్‌ను మించి వేగంగా ఈ ప్రక్రియలో ముందడుగేశాయి. ఒడిషా రాష్ట్రంలో ప్రసారమయ్యే ప్రాంతీయ ఛానల్‌ ఓటివి ఇప్పటికే లిసా పేరిట ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ను వీక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు లిసాయే రోజూ ఆ ఛానల్‌లో వార్తలు చదువుతోంది. తాజాగా ఆజ్‌తక్‌ ఛానల్‌ సనా పేరిట మరో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ న్యూస్‌రీడర్‌తో వార్తలు చదివిస్తోంది. న్యూస్‌ 18 పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల విభాగం ఎఐకౌర్‌ పేరిట మరో కృత్రిమ మేథతో కూడిన న్యూస్‌ ప్రజెంటర్‌ను, కర్ణాటకలో ప్రసారమయ్యే కన్నడ ఛానల్‌ పవర్‌ టీవీ సౌందర్య పేరిట మరో ఏఐ యాంకర్‌ను అప్పుడే జనం మీదకు వదిలేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి వార్త ప్రసారాల సంస్థ కూడా వార్తాంశాల్ని వీక్షకులకు వివరించేందుకు కృత్రిమ మేధతోకూడిన యాంకర్లను సృష్టించడంలో పోటీలు పడుతున్నారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాధాన్యత ప్రతి రంగంలో పెరుగుతోంది. ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోనూ కృత్రిమ మేథ వినియోగానికి గల అవకాశాలపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. 2030 నాటికి భారత్‌లో కూడా కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఇది నిరుద్యోగాన్ని పెంచే ప్రమాదముందని నిపుణులు ఇప్పట్నుంచే భయపడుతున్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనితీరును మెరుగుపర్చింది. అదే సమయంలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆటోమేషన్‌, న్యూరల్‌ నెట్‌వర్క్‌ల కారణంగా రాబోయే దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఉపాధి అవకాశాల్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. వ్యాపారం, విద్య, మార్కెట్లు, సేవారంగం, ప్రభుత్వరంగాల్లో గణనీయమైన మార్పుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణం కానుంది.

వచ్చే దశాబ్దం ఏఐదే
రానున్న పదేళ్ళలో కృత్రిమ మేథతో డ్రైవర్లతో సంబంధంలేకుండా నడిచే వాహనాలు రూపొందనున్నాయి. ఇవి పూర్తిగా ముందుస్తుగా నిర్వహించబడ్డ ప్రోగ్రామింగ్‌కనుగుణంగా పని చేస్తాయి. ఇవి అందుబాటులోకొస్తే ట్రాఫిక్‌ సమస్యలుండవు. నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తాయి. వేగ నియంత్రణను అమలు చేస్తాయి. ఈ వాహనాలు అందుబాటులోకొస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది డ్రైవర్‌ లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఒక్క భారత్‌లోనే సుమారు రెండు కోట్ల మంది డ్రైవర్లుగా పని చేస్తున్నారు. 2050నాటికి వాహనాల మార్కెట్‌లో 90 శాతాన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆటోమేషన్‌తో కూడిన వాహనాలు ఆక్రమిస్తాయని భవిష్యత్‌ అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వాహనాల వల్ల భద్రత పెరుగుతోంది. ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది. అలాగే రైళ్ళు, విమానాల తయారీలో కూడా రానున్న రెండు దశాబ్ధాలు అత్యంత కీలకం. ఈ రంగంలోనూ కృత్రిమమేధకు పదునుపెడుతున్నారు.

ఆటోమేషన్‌ ద్వారా రైళ్ళు విమానాల నిర్వహణకు యంత్రాల్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో విమాన, రైల్వే పైలెట్ల ఉద్యోగాలన్నీ ఖాళీ కానున్నాయి. అలాగే ఈ కామర్స్‌ రంగంలోనూ ఏఐ తీవ్ర మార్పులు తేనుంది. ఇప్పటికే ఉత్పత్తుల సేకరణ, కస్టర్ల ఆర్డర్ల అమలు, పర్యవేక్షణను ఆటోమేషన్‌తో కూడిన కంప్యూటర్లు, రోబోట్‌లు నిర్వహిస్తున్నాయి. అలాగే డెలీవరికి సంబంధించి స్థలాన్ని నేవిగేట్‌ చేయగలిగే రోబోట్‌ల తయారీ మొదలైంది. స్వయం ప్రతిభక్త డ్రోన్లు, కార్ల ద్వారా ఆటోమోటిక్‌గా ఆర్డర్లు కస్టమర్ల నిర్దేశిత చిరునామాకు చేరతాయి. దీంతో డెలివరీ బోయ్స్‌, సేల్స్‌ పర్శన్స్‌ ఉద్యోగాలు కోల్పోతారు. నెట్‌వర్క్‌ స్టోర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. వీటిలో సిబ్బంది ఉపాధి కోల్పోతారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సుల బాధ్యతను కూడా భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన యంత్రాలే నిర్వహించనున్నాయి.

- Advertisement -

రోగుల శరీరానికి జోడించబడే చిన్నపాటి పరికరాలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో పని చేస్తాయి. రోగుల ఆరోగ్యాన్ని క్రమపద్దతిలో ఇవి పర్యవేక్షిస్తాయి. రోగి అనారోగ్య వివరాల్ని ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యుడికి చేరవేస్తాయి. వైద్యుల సూచనలకనుగుణంగా రోగికిచ్చే ఔషధాల్లో మార్పు చేస్తాయి. ఇవి పూర్తిగా అంద ుబాటులోకొస్తే నర్సుల ఆవశ్యకత తగ్గుతుంది. ఇప్పుడు టీచింగ్‌ ప్రొఫెషన్‌ పెద్దసంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది. కానీ వర్చువల్‌ అసిస్టెంట్‌ల రాకతో టీచర్ల ఆవశ్యకత తగ్గనుంది. వర్చువల్‌ అసిస్టెంట్‌ అనేది టాస్క్‌ బేస్డ్‌ హ్యూమన్‌ వెర్బల్‌ కమాండ్‌తో పని చేస్తుంది. ఇదొక సాఫ్ట్‌వేర్‌ ఏజెంట్‌. ఇది వర్చువల్‌ విధానంలో మానవ ఉపాధ్యాయుడి తరహాలోనే పలురకాల సంబోధనలు, సంజ్ఞలు, శారీరక కదలికల్తో విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తుంది. దీని సాయంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం చేయెచ్చు. తమ సందేహాల్ని ఈ సాప్ట్‌వేర్‌ ఏజెంట్‌ ద్వారా తీర్చుకోవచ్చు.

పారిశ్రామిక రంగంలో తీవ్ర ప్రభావం
పరిశ్రమల్లో కూడా ఆటోమేషన్‌ గణనీయ సంఖ్యలో ఉద్యోగ నష్టాల్ని కల్పించనుంది. పరిశ్రమల్లో ఉత్పాదకతను ఆటోమేషన్‌ ద్వారా క్రమపద్ధతిలో నిర్వహించొచ్చు. సంక్లిష్టమైన సృజనాత ్మకమైన తయారీ వ్యవస్థల్లో కూడా ఇది సులువుగా పని సామర్ద్యాన్ని ప్రదర్శిస్తుంది. 2024లోనే ఆటోమేషన్‌ వినియోగం 12శాతం పెరుగుతుందని అంచనాలేస్తున్నారు. రవాణా, తయారీ, సేవా రంగం, రిటైల్‌ అమ్మకాలు, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో దీని వినియోగం పెరుగుతోంది. ఆ స్థాయిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కూడా తగ్గనున్నాయి.

అయితే ఎంతటి కృత్రిమ మేథ అయినా దాని తయారీ, నిర్వహణకు మానవ వనరుల అవసరం తప్పదు. కొత్త నైపుణ్యాలు గల ఉద్యోగులకు మాత్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా పెద్దగా నష్టం ఉండదు. కానీ నైపుణ్యాల్ని పెంచుకోవడంలో ఆసక్తి చూపని ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ భారీ మార్పులు తీసుకురానుంది. ఇది డేటా ప్రాసెసింగ్‌ను ఆటోమేటిక్‌గా నిర్వహిస్తుంది. డేటా ఎంట్రీ, విశ్లేషణల సమయాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగులకంటే ఎక్కువ ఖచ్చితత్వం, సామర్థ్యాల్తో పని చేస్తుంది. మోసాల్ని, ప్రమాదాల్ని అంచనాలేస్తుంది. వైద ్య చిత్రాల్ని విశ్లేషించగలుగుతుంది.
ఇన్ని సానుకూలతల్తో దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగాన్ని క్రమపద్ధతిలోనే ప్రభుత్వాలు ఆమోదించాల్సిన అవసరముంది. భారత్‌లో జనాభా అధికం. వీరిలో ఎక్కువమంది నైపుణ్యం లేని కార్మికులు, ఉద్యోగులే. వీరికి ఇప్పట్నుంచి పనిలో నైపుణ్యాల్ని పెంచాలి. లేదా వివిధ రంగాల్లో ఆటోమేషన్‌ అమలును కాలపరిమితికి అనుగుణంగా నియంత్రించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement