మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సింబల్‌ని పోలిన కారు గుర్తును పోలిన మరో 8 సింబల్స్‌ని తొలగించాలని టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయినా ఈసీ పట్టించుకోకపోవడంతో న్యాయ పోరాటానికి రెడీ అయ్యింది. దీనిపై హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని నిన్న కోరగా.. న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ వంటి గుర్తులను తొలగించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఎన్నికల కమిషన్‌ను టీఆర్ఎస్ కోరింది. అయితే ఈసీ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో పార్టీ పెద్దలు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేశారు.
2018 ఎన్నికల్లో కూడా కారును పోలిన సింబల్స్ వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆధారాలు చూపుతున్నారు. టీఆర్ఎస్ సింబల్‌కు తగ్గట్టే కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి టీఆర్ఎస్ నేతలు వివరించారు.
అంతేకాకుండా మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018లో జరిగిన ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. దీంతో కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను తొలగించాలని కోరారు. దీనిపై సోమవారం లంచ్ మోషన్‌కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు టీఆర్ఎస్ నేతలు రెడీ అయినట్టు తెలుస్తోంది.