మానవ శరీరంలో ఐరన్‌ది చాలా కీలక పాత్ర. ప్రతి కణానికి ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వాలంటే ఐరన్ ఎంతో అవసరం. కానీ, ఐరన్ లోపం దేశంలో మహిళలు, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో దాదాపు 50శాతం కంటే ఎక్కువ మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. కొన్ని లక్షణాల ద్వారా ఐరన్ లోపాన్ని ముందే పసిగట్టవచ్చు. ఐరన్ లోపాన్ని ఎక్కువ కాలం పాటూ పట్టించుకోకుండా వదిలేస్తే అది తీవ్ర సమస్యలకు కారణం అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
తరచుగా తలనొప్పి వస్తుంటే..
తరచూ తలనొప్పి వేధిస్తుంటే దాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఐరన్ లోపం వల్ల కూడా ఇట్లా జరుగుతుంది. రక్తంలో ఐరల్ పర్సంటేజ్ తగ్గితే మెదడుకు ఆక్సిజన్ సరిగా అందదు. దీని వల్ల రక్తనాళాలు వాపునకు గురవుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. అలాగే తల తిరిగినట్టు అనిపించడం, లో బీపీ రావడం కూడా జరుగుతుంది.
చర్మం రంగు మారడం..
చర్మం రంగు మారిపోతుంది. పాలిపోయినట్టు అవుతుంది. ఐరన్ తగ్గడం వల్ల హిమోగ్లోబిన్ కావాల్సినంత ఉత్పత్తి అవ్వదు. దీని వల్ల చర్మం రంగు పాలిపోయినట్టు అవుతుంది. కనురెప్పల లోపలి భాగాల్లో తెల్లగా మారినా కూడా ఐరన్ ధాతు లోపం ఉందేమో గుర్తించాలి.
నీరసంగా ఉండడం..
కారణం లేకుండా నీరసంగా అనిపిస్తుంది. కొందరైతే ఉదమం లేచినప్పటి నుంచి నీరసంగానే కనిపిస్తుంటారు. ఐరన్ శాతం లోపించిన వారిలో ఇది సాధారణ లక్షణం. హిమోగ్లోబినే ఆక్సిజన్ ను మోసుకుని వెళుతుంది. అలాంటి హిమోగ్లోబిన్ శాతమే తగ్గితే శరీరమంతా నిస్సత్తువగా మారుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
ఐరన్ ధాతువు లోపించిన వారిలో ఊపిరితీసుకోవడం ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది. ఛాతీలో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. ఇనుము లోపించడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల శరీరమంతటికీ ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో శరీరం తనకు కావాల్సిన ఆక్సిజన్ కోసం కష్టపడుతుంది. ఇలాంటి సమయంలో ఊపిరి తీయడం కష్టంగా అనిపిస్తుంది.
గుండె స్పందనలలో తేడా..
ఐరన్ లోపం అధికంగా ఉంటే గుండె కొట్టుకునే వేగంలో కూడా తేడా వస్తుంది. గుండె కొట్టుకునే తీరు మారుతుంది. కాబట్టి ఎవరికైనా ఆ తేడా తెలిస్తే ఐరన్ లోపం ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
నాలుక రంగు ద్వారా గుర్తించొచ్చు..
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా నాలుకను చూపించమంటారు. నాలుక రంగు ద్వారా ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు. నాలుక వాపు రావడం, రంగు మారడం వంటివి అనారోగ్యాన్ని సూచిస్తాయి. నాలుక గులాబీ రంగులో కాకుండా తెల్లగా పాలిపోయినట్టు ఉంటే ఐరన్ లోపమని అర్థం చేసుకోవాలి.
జుట్టు, చర్మం
చర్మ సమస్యలు రావడం, జుట్టు ఎండిపోయినట్టు మారడం, రాలడం వంటివి ఐరన్ లోపాలన్ని సూచిస్తాయి. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందాక, చివరగా అందేది జుట్టు, చర్మానికే. ఈ రెండూ కూడా ప్రభావితం అవుతున్నాయంటే ఐరన్ లోపం అధికంగా ఉన్నట్టే.