బైక్, స్కూటర్, కారు.. వాహనం ఏదైనా కావచ్చు. కానీ, బండి ఎక్కిన తర్వాత కాస్త రూల్స్ పాటించాలన్న సోయి వాహనదారులకు ఉండాలి. ఎదురుగా వాహనాలు ఉన్న విషయం కూడా మరిచిపోయి డ్రైవ్ చేస్తే ఇదిగో.. పరిస్థితి ఇట్లనే ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో అయితే.. పోలీసులు ఎన్ని విధాలా చెప్పినా కొంతమంది అయితే పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద.. ఆ తర్వాత జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో రాంగ్ రూట్లో వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు.
చదువుకోని, చదువురాని వాళ్లు అంటే వారికి ట్రాఫిక్ రూల్స్ తెలియవేమో అనుకోవచ్చు.. కానీ, సంపన్న కుటుంబాలకు చెందిన వారు.. పెద్ద పెద్ద మోడల్ వాహనదారులే అడ్డదారుల్లో వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. నలుగురికి నచ్చజెప్పాల్సిన స్థితిలో ఉన్న వారే తప్పుడు మార్గాలను అన్వేషిస్తే.. ఇక మిగతా వారి గతేంటి? ఫిల్మ్‌నగర్‌కు ముందు వచ్చే జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో రోజూ రాత్రి వేళ ట్రాఫిక్ జామ్ అవుతోంది.. కనీసం ఈ వీడియో చూసి అయినా ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఏమవుతుందో అర్థం చేసుకుంటే మంచిది అంటున్నారు పోలీసులు.