ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలని సూచించారు. ఆ తర్వాత చైనానే ఆ పని చేసిందని అమెరికా చెప్పాలని, దీంతో రష్యా, చైనా కొట్టుకు చస్తుంటూ మనం ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చని హస్యమాడారు. నిన్న జరిగిన రిపబ్లికన్ జాతీయ కమిటీ అగ్రదాతల సమావేశంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. దీంతో సభలోని వారంతా నవ్వడంతోపాటు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు, బాధ్యతా రహిత చర్యలపై విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరో దేశంపై రష్యా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదని ట్రంప్ గుర్తు చేశారు. ‘బుష్ ఆధ్వర్యంలో జార్జియాపై రష్యా దాడి చేసింది. ఒబామా హయాంలో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. తాజాగా బైడెన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది’ అని వ్యాఖ్యానించారు.