హైదరాబాద్, ఆంధ్రప్రభ: నాలాల అభివృద్ధికి, మూసీ నది సుందరీకరణకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి భారత ప్రభుత్వం నుంచి రూ.10వేల కోట్లు నిధులు తెస్తే ఆయనను హైదరాబాద్ నగర నడిబొడ్డున పౌర సన్మానం చేసి జేజేలు పలుకుతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో భారీ వరదలు సంభవించి పెద్దఎత్తున నష్టం వాటిల్లి పౌర జీవనం స్తంభించిపోతే కేంద్రం కనీసం రూపాయి కూడా సాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఎల్బీనగర్ అసెంబ్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీ రామారావు బుధవారం శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ కూడలిలో రూ.9.28 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్‌పాస్, బైరామల్‌గూడలో రూ.28 కోట్ల 64 లక్షలతో పూర్తి చేసిన పై వంతెనను ఆయన ప్రారంభించారు. బండ్లగూడలో ఉన్న నాగోల్‌లో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
రాజధాని హైదరాబాద్‌లో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.10 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలని కేటీ రామారావు చురకలంటించారు. హైదరాబాద్‌లో వరదలు సంభవిస్తే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. కనీసం మూసీ ప్రాజెక్టుకో… నాలాల పునరుద్ధరణకో రూ.10 వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చి సాయం అందిస్తే ఆయనను, భాజపా నాయకులను హైదరాబాద్‌లో పౌర సన్మానం చేసి చప్పట్లు కొడతామని చెప్పారు. అభివృద్ధి, మంచి పనులు చేయడంలో పోటీ పడదామని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల సాయం చేయాలని, తమది చిన్న ప్రభుత్వమని కేంద్రం పెద్ద సర్కార్ అని పేర్కొన్నారు. అభివృద్ధిలో పోటీ పడుతూ ప్రజల మనసులను దోచుకునే విధంగా కిషన్‌రెడ్డి ముందుకు రావాలని ఆయన కోరారు.
వరద ముంపు నివారణకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్య ఉందన్న విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తెచ్చారని త్వరలోనే ఇందుకు సంబంధించి శుభవార్త వింటారని చెప్పారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల కొన్ని కాలనీలలో రిజిస్ట్రేషన్ సమస్య తలెత్తిందని దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలిసిందని పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.678 కోట్లతో పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు కేటీ రామారావు చెప్పారు.
భాజపా కార్పొరేటర్లు కూడా వారి వారి వార్డుల అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో అతి ముఖ్యమైన సమస్య వరద ముప్పు అని, ఈ ఏడాది వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాలాల పనులు వర్షాకాలంలోగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు.
సిటీ నీట మునిగితే రూపాయి ఇయ్యలే.. కేంద్రంపై కేటీఆర్ మండిపాటు
Advertisement
తాజా వార్తలు
Advertisement