సుధా భరద్వాజ్ కుమార్తె తల్లికి రాసిన లేఖలో ఏముందంటే..
పూణె పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సుధా భరద్వాజ్‌ను కొందరు నక్సలైట్ అంటున్నారు. ఇంకొందరు మానవ హక్కుల కార్యకర్త అంటున్నారు. ఇంతకీ ఆమె కూతురు ఆమెను ఎలా చూస్తారు? తల్లితో చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం ఎలాంటిది తెలియాలంటే.. తల్లి గురించి ఆమె కూతురు మాయషా రాసిన ఈ లెటర్ చదవాల్సిందే..
ఉదయం 7 గంటలవుతోంది. అమ్మ పరుగున వచ్చి నన్ను నిద్ర లేపింది. ‘వాళ్లు మనింట్లో సోదాలు చేయడానికి వచ్చారు, లే’ అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందరూ అమ్మ గురించి రాస్తున్నారు. కాబట్టి, నేను కూడా రాయాలనుకున్నా.
మొదట్నుంచీ నా ఆలోచనలకు, అమ్మ ఆలోచనలకు మధ్య చాలా తేడా ఉంది. ఆ విషయంలో చాలాసార్లు వాదులాడుకున్నాం కూడా. ‘మనం ఎందుకు ఇలా జీవిస్తున్నాం? ఎందుకు అందరిలా ఉండట్లేదు?’ అని చాలాసార్లు అమ్మను అడిగా.
‘చూడు నాన్నా, నాకు పేదవాళ్ల మధ్య ఉండటం, వాళ్లతో కలిసి పనిచేయడం ఇష్టం. నువ్వు పెద్దయ్యాక నీకు నచ్చినట్లు ఉండొచ్చు’ అని అమ్మ నాతో చెప్పేది. అయినా నాకది నచ్చేదికాదు. ‘నువ్వు వేరేవాళ్ల కోసం చాలా సంవత్సరాలు కేటాయించావు. ఇప్పుడు నీ కోసం నువ్వు బతుకు’ అని చెప్పేదాన్ని. నాకోసం కూడా తను సమయం కేటాయించకపోవడం నచ్చేది కాదు.
చిన్నప్పుడు నేను యూనియన్‌కు చెందిన ఓ తాతగారి ఇంట్లో ఉండేదాన్ని. వాళ్ల పిల్లలతోనే కలిసి పెరిగా. అమ్మ గుర్తొచ్చిన్నప్పుడల్లా ఆమె చీర పట్టుకొని ఏడ్చేదాన్ని. నాకు ఓసారి జ్వరం వచ్చినప్పుడు బామ్మ నా నుదురు నిమిరింది. ఆ చేతులు అమ్మవేమో అనుకొని నేను ఆనందంతో గట్టిగా అరిచా. కానీ కళ్లు తెరిచి చూస్తే అమ్మ కనిపించలేదు.
ఆరో తరగతికి వచ్చాకే నేను అమ్మతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టా. అందుకే ఇప్పటికీ మేమిద్దం ఒకరినొకరం సరిగా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది.
తిండి, నిద్ర గురించి పట్టించుకోకుండా రోజుల తరబడి అమ్మ ఇతరుల కోసం పనిచేయడం, వాళ్ల తరఫున పోరాడటం నేను చూశా. తన గురించి తాను పట్టించుకోకపోవడం నాకు అస్సలు నచ్చేది కాదు.
అమ్మ లాయర్. తాను ఏదైనా కేసును ఒప్పుకున్నప్పుడు దాని గురించే ఆలోచిస్తూ బాధపడేది. అలాంటి కేసులు తన వృత్తిలో భాగమే. అలాంటప్పుడు బాధపడటం ఎందుకని నేను అడిగేదాన్ని. ‘మనం కాకపోతే వాళ్ల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు’ అని అమ్మ చెప్పేది.
‘ఆదివాసీల కోసం పనిచేస్తున్నట్లు కొంతమంది చెప్పుకుంటారు. కానీ అదంతా షో కోసమే. వాళ్లు మాత్రం తమ పిల్లల్ని అమెరికాలో చదివిస్తారు’ అని ఓసారి ఏదో టీవీ న్యూస్‌లో చెబుతుంటే విన్నా. వాళ్లకు నా గురించి తెలీదేమో. నేను కార్మికుల బస్తీలో ప్రభుత్వ పాఠశాలలో హిందీ మీడియంలో చదువుకున్నా.
‘నువ్వు ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని నన్ను హిందీ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు?’ అని అమ్మతో చాలా సార్లు పోట్లాడా. నా అంతట నేనే ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం నేర్చుకున్నా. 12వ తరగతి తరువాతే ఇంగ్లిష్ మీడియంకు మారా.
అమ్మను ఇప్పుడు నక్సలైట్ అంటున్నారు. దానివల్ల నాకేం బాధగా లేదు. కానీ జనాలు నిజానిజాలు తెలీకుండా ఏది తోస్తే అది అనేయడం అలవాటు చేసుకోవడం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది.
జనాలు ఏమంటున్నారో, పోలీసులు ఏమంటున్నారో నాకు అనవసరం. అయినా, మా అమ్మ గురించి నాకంటే బాగా ఎవరికి తెలుసు.
ఆదివాసీలు, కార్మికులు, రైతుల తరఫున పోరాడటం, వాళ్ల కోసమే మొత్తం జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వారనే నా అభిప్రాయం.
ఎవరు ఏమైనా అననీ, తనకు కూతురిగా నేను చాలా గర్వపడుతున్నా.
‘బేటా, నేను డబ్బు సంపాదించలేదు, కానీ ప్రజల అభిమానాన్ని సంపాదించా’ అని అమ్మ నాతో చెబుతుండేది. తను చెప్పింది నిజమే. నాకు ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తోంది.
అమ్మా… ఐ లవ్ యూ.
మాయషా’.
సుధా భరద్వాజ్ ఎవరు.. ఏం చేస్తారు..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ జైలు నుంచి విడుదలయ్యారు. భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో బాంబే హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టు విచారించి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాను డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని పేర్కొంటూ ఆమె ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించి విచారణ జరిపిన విషయం కూడా తెలిసిందే. ఆ మేరకు ఆమె ముంబయి జైలు నుంచి విడుదలయ్యారు.
భీమా కోరేగావ్ హింస కేసులో సుధా భరద్వాజ్‌తో పాటు వరవరరావు, సోమసేన్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సుధా భరద్వాజ్‌కు డీఫాల్ట్ బెయిల్ లభించింది. కానీ, మిగిలినవారికి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.