ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ పాలసీ అక్రమాల నేపథ్యంలో ఆయనపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మనీష్ సిసోడియా తన ట్విట్టర్‌లో ఓ కామెంట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి.. బీజేపీలో చేరితే అప్పుడు తనపై ఉన్న అన్ని కేసులను ఆ పార్టీ మూసివేస్తుందని సిసోడియా తెలిపారు. దీనికి సంబంధించిన మెసేజ్ తనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
బీజేపీ నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని, ఆప్‌ను బ్రేక్ చేసి, బీజేపీలో చేరాలని ఆ మెసేజ్‌లో ఉందని, మీపై ఉన్న అన్ని సీబీఐ, ఈడీ కేసులను తొలగిస్తామని ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు సిసోడియా తన ట్వీట్‌లో తెలిపారు. తనపై అన్ని తప్పుడు కేసులు బనాయించారని, మీకు కావాల్సింది మీరు చేసుకోవాలని బీజేపికి ఆయన హెచ్చరిక జారీ చేశారు. మహారాణా ప్రతాప్ అనుచరుడిని అని, రాజ్‌పుత్ అని, కావాలంటే తన నరుక్కుంటాను కానీ, అవినీతి నేతలకు లొంగిపోనని, తనపై ఉన్న కేసులన్నీ అక్రమైనవని సిసోడియా తన ట్వీట్‌లో తెలిపారు.