ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టయితే రాజకీయాలనుంచి ఆప్ తప్పుకుంటుందని ఆ పార్టీ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల వాయిదా వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ బయట ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలోని ఉత్తర, తూర్పు, దక్షిణ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసే బిల్లును మంగళవారంనాడు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ చిన్నపార్టీని, చిన్న ఎన్నికలను చూసి ఆ పార్టీ భయపడుతోందని, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని,దమ్ముంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయకుండా సమయానికే నిర్వహించి గెలవాలని సవాల్ చేశారు.
ఆ పార్టీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలనుంచి తప్పుకుంటుందని ప్రకటించారు. అనంతరం ట్విట్టర్లోనూ ఆయన స్పందించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదావేయడమంటే దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యం కోసం వారి బలిదానం చేశారని గుర్తు చేశారు. ఓటమి భయంతో ఇవాళ ఢిల్లీలో ఎన్నికలు వాయిదా వేశారు, మునుముందు రాష్ట్రాలలోను, దేశంలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తారని ఆరోపించారు.