Tuesday, November 26, 2024

టీఆర్ఎస్- బీజేపి పొత్తు పెట్టుకుంటే.. ఈటల పరిస్థితి ఏంటి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో నడిచిన ఈటల… 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. ఇక కాషాయ కండువ కప్పుకోనున్నారు. మంత్రివర్గం నంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి కొత్త పార్టీపై చర్చ మొదులుకొని… చివరకి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలకు బీజేపీనే ఆప్షన్ కనిపించి ఉండొచ్చు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒకవేళ టీఆర్ఎస్ బీజేపీతో కలిస్తే..?  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా ఉన్న టీడీపీ… గత అసెంబ్లీ ఎన్నికల సంరద్భంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అలాంటిది బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఉంటాయా? ఇదే డౌట్ మాజీ మంత్రి ఈటలకు వచ్చింది.

బీజేపీలో తన చేరికను దాదాపు ఖాయం చేసుకున్న ఈటల రాజేందర్ నిన్న సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల పలు సందేహాలు లేవనెత్తారు.   భవిష్యత్తులో టీఆర్ఎస్ – బీజేపి పొత్తు పెట్టుకుంటే బీజేపీనే నమ్ముకొని వచ్చిన మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఈటెల ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని చెప్పారు. అయితే, ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని నడ్డా తేల్చి చెప్పారు. పార్టీలో చేరక పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని, పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఈటెలకి జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి మాటపై నమ్మకంతో ఉన్న ఈటల… ఇక ఆలస్యం చేయకుండా కాషాయ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement