తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బండి ఇవ్వాల (శుక్రవారం) మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్కు అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణలో ఒకవేళ తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్టు ధరణి పోర్టల్ని తాము రద్దు చేయబోమని, ధరణి పోర్టల్లో ఉండే సమస్యలను మాత్రం పరిష్కరిస్తామన్నారు.
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి రాజకీయ డ్రామాలకు తెరతీశాయని, కాంగ్రెస్లో ప్రీ, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కర్నాటక ఎన్నికల కోసం డబ్బులు ఇచ్చింది కూడా కేసీఆర్ అని బండి ఆరోపించారు.