Friday, November 22, 2024

తూ.గో. జిల్లాలో ఆదర్శ వివాహం

ఆయన రెండు అడుగులు.. ఆమె నాలుగు అడుగులు.. ఇద్దరు కలిసి మొత్తం ఏడు అడుగులు. అదేంటి లెక్కతప్పు కదా.. రెండు, నాలుగు కలిపి ఆరు అడుగులు కదా అనుకుంటున్నారా.. అయితే అసలు వివరాల్లోకి వెళ్దాం పదండి. వరుడు ఎత్తు రెండు అడుగులు. వధువు ఎత్తు నాలుగు అడుగులు. ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు అన్నమాట. వీరి వివాహానికి పొడవు అడ్డు రాలేదు. పెద్దల నిశ్చయం ప్రకారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి శాంతినగర్‌లో జరిగిన ఈ వివాహ వేడుక పలువురికి ఆదర్శంగా నిలిచింది.

వరుడు దేవరపల్లి శ్రీనుబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. పుట్టుక నుంచి ఎత్తు తక్కువగానే ఉండి రెండు అడుగుల వరకే పొడవు ఎదిగాడు. అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన గొల్లపల్లి బలరామమూర్తి, లక్ష్మీ దంపతుల చిన్న కుమార్తె సత్య దుర్గ. ఆమె పొడవు నాలుగు అడుగులు. సత్య దుర్గ 8వ తరగతి చదువుతోంది. వీరి వివాహం పెద్దలు నిర్ణయించడంతో శాంతినగర్‌లో శుక్రవారం నాడు క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఈ వివాహ వేడుకకు జనసేన పార్టీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఇతర నాయకులు హాజరై ఆదర్శ జంటను ఆశ్వీరదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement