టెల్ అవీవ్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నగరంగా రికార్డులకెక్కింది. ఇజ్రాయెల్‌లో ప్రముఖ నగరంగా ఉన్న టెల్ అవీవ్ మొదటిసారి ఈ రికార్డుని సొంతం చేసుకుంది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సు యూనిట్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలను అధ్యయనం చేసి, అమెరికన్ డాలర్లలో అక్కడి నగర జీవితాల ఖర్చుని అంచనా కట్టింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్వవ్యోల్బణం కారణంగా అనేక నగరాల్లో జీవనం దుర్లభంగా మారుతున్నది. టెల్ అవీవ్లో అయితే ఒక్కసారిగా అయిదింతలు పెరిగిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. 173 నగరాల్లో వస్తువులు, సేవల ధరలను ప్రామాణికంగా తీసుకుని ఈ అధ్యయనం చేశారు.
టెల్ అవీవ్ నగరంలో రవాణా, ఇతరత్రా సామాగ్రి ధరలను లెక్కల్లోకి తీసుకున్నారు. అమెరికన్ డాలర్ కన్నా ఇజ్రాయెల్ నేషనల్ కరెన్సీ షెకెల్ బలంగా ఉండటం కూడా ఒక కారణం. పారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండో స్ధానంలో నిలిచాయి. మూడో స్ధానంలో జురిచ్, హాంగ్‌కాంగ్ ఉండగా, న్యూయార్క్ ఆరో స్ధానంలో, జెనీవా ఏడో స్ధానంలో వచ్చాయి. కోపెన్‌హాగెన్ ఎనిమిది, లాస్ ఏంజెల్స్ తొమ్మిది, జపాన్‌లోని ఒసాకా పదో స్ధానంలో ఉన్నాయి. మొత్తం మీద టాప్ టెన్‌లో వివిధ నగరాలు తారుమారయ్యాయని దీన్ని బట్టి అర్ధం అవుతున్నది. కిందటేడాది అయితే పారిస్, జురిచ్, హాంగ్‌కాంగ్..ఈ మూడూ కలిసి మొదటి స్ధానాన్ని ఆక్రమించాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో డేటా సేకరించినట్టు నిర్వహణ సంస్ధ వెల్లడించింది. అప్పట్లో రవాణా, వస్తుసామగ్రి ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికక్కడ స్ధానిక కరెన్సీ విలువల్లో సగటున 3.5 శాతం ధరలు పెరిగిన సందర్భమది. గత అయిదేళ్లలో ద్రవ్యోల్బణ రేటు అత్యధికంగా వేగంగా పెరిగిపోయింది.
కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం వల్ల తలెత్తిన సామాజిక నిబంధనలు, ఆంక్షల కారణంగా వివిధ రకాల వస్తు సామగ్రి రవాణా, సరఫరాకు ఆటంకం కలిగింది. దాంతో కొరత ఏర్పడింది. దరిమిలా ధరలు పెరిగాయనిఈఐయూ హెడ్ ఉపాసనా దత్ తెలిపారు. పెట్రోల్ ధరలు ఈ ఏడాది ఇండెక్స్ మీద తీవ్ర ప్రభావం చూపిందని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోకెల్లా అత్యతం చవకైన సిటీగా డెమాస్కస్ నమోదైందన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ 79 నుంచి 29 వస్ధానానికి చేరిందని, అమెరికా ఆంక్షలు అక్కడ ధరల పెరుగుదలకు, వస్తుసామగ్రి కొరతకు దారితీసి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..