Tuesday, November 26, 2024

ఈ ఏడాది 100 కోట్ల మందికి టీకా అసాధ్యం: ICMR

దేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటిని ప్రజలకు వేయడంలో కేంద్ర ప్రభుత్వానిది బలహీనమైన ప్రణాళిక అని ఐసీఎంఆర్‌ నిపుణులు విమర్శించారు. కేంద్ర బలహీన ప్రణాళిక వల్లే దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని, ప్రజలకు టీకా వేయడానికి లేకుండాపోయిందని పేర్కొన్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ప్రణాళికలు వేస్తున్నప్పటికీ 100 కోట్ల మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోవడం కష్టమని స్పష్టం చేశారు. ఈ మేరకు బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ అనే ఆన్‌లైన్‌ జర్నల్‌లో నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇతర దేశాల్లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లను ఆమోదించే ప్రక్రియను వేగతవంతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా వ్యాక్సిన్లను వేయడానికి ప్రైవేటు దవాఖానలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, అయితే అంత సొమ్ము వెచ్చించి చాలా కొద్దిమంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకోగలరని తెలిపారు. దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయాలన్నారు. వ్యాక్సిన్‌ ధరలను కేంద్రానికి తక్కువగా, రాష్ర్టాలకు ఎక్కువగా నిర్ణయించడం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి తీవ్రమైన చేటు చేస్తుందని హెచ్చరించారు. ‘వయోజనులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే మొబైల్‌ యాప్‌ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇది సాధ్యం కాదు. ఎందుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మూడోవంతు మందికి మాత్రమే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంద’ని వారు వివరించారు. భారత్‌ తన వ్యాక్సిన్‌ వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement