Thursday, November 21, 2024

లాక్‌డౌన్ ఎత్తివేతపై తొందరపడొద్దు: ఐసీఎంఆర్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేత ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచనలు చేసింది. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ వెల్లడించారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకుని లాక్‌డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

ప్రతివారం పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండి కరోనా ముప్పు అధికంగా ఉన్న వర్గాలకు 70 శాతం వ్యాక్సిన్ వేసి సామాజిక బాధ్యతగా ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తుంటే ఆయా ప్రాంతాలలో లాక్‌డౌన్‌లు తొలగించవచ్చన్నారు. కరోనా పరీక్షలను పెంచి జిల్లా స్థాయిలో కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయడం అంత ప్రభావవంతంగా ఉండదన్నారు. కాగా ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 21.39 పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గింది. మే 31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాలలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అయితే బలరామ్ భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటివరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాలలో మాత్రం చేర్చలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement