Tuesday, November 26, 2024

మంచు తుపాను ఎఫెక్ట్… 1500 విమానాలు ర‌ద్దు

మంచు తుపాను అగ్ర రాజ్యాన్ని వణికిస్తోంది. ఫ‌లితం 1500 విమానాలు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. ఎక్క‌డంటే అగ్రరాజ్యమైన‌ అమెరికాలో మంచు తుపాను ఎక్కువగా ఉంది. అమెరికాలోని ఉత్తరాది, పశ్చిమ మధ్య రాష్ట్రాల్లో భారీ హిమపాతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని కారణంగా కాలిఫోర్నియాలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలంతా చీకట్లో ఉంటున్నారు. అరిజోనా నుంచి వ్యోమింగ్ వరకు అంతర్రాష్ట్ర రహదారులను మూసివేశారు. 1,500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారు. మంచు తుపాను కార‌ణంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. మిన్నెసోటా శాసనసభను కూడా మూసివేయాల్సి వచ్చింది. ప్రయాణాలు కష్టతరమయ్యాయి.

1,500 కంటే ఎక్కువ విమాన స‌ర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. వాటిలో 400 కంటే ఎక్కువ సర్వీస్ లు మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు చేస్తున్నవే. దేశవ్యాప్తంగా మరో 5,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రహదారులపై కూడా మంచు కూరుకుపోయింది. చాలా రహదారులను మూసివేయడంతో ప్రజలంతా ఎక్కడివాళ్లు అక్కడే నిలిచిపోయారు. గంటకు రెండు అంగుళాల వరకు మంచు కురుస్తుంది. బలమైన గాలులు ఉత్తర మైదానాలు, ఎగువ మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రయాణ పరిస్థితులను ప్రమాదకరంగా ఉన్నాయని ఎఫ్ఏఏ పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా మిన్నెసోటా తోపాటు ఇతర రాష్ట్రాల్లో గ్రేట్ లేక్స్, దక్షిణ మైదానాల మీదుగా విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement