న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తాను ప్రకాశ్ గౌడ్‌కు ఎలాంటి ఇబ్బంది కల్గించనని, పార్టీలో చేరినప్పుడే మాట ఇచ్చానని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో తాను పోటీ చేస్తానని చెప్పలేదని అన్నారు. ఓ ప్రెస్మీట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అమ్మ రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయరని, పోటీ చేయాల్సి వస్తే తాను పోటీ చేస్తాననని మాత్రమే చెప్పానని వెల్లడించారు. అంతే తప్ప ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదని అన్నారు.
తన తల్లి సబిత ఇంద్రారెడ్డి, తాను బీఆర్ఎస్లో చేరినప్పుడే ప్రకాశ్ గౌడ్‌కు మాట ఇచ్చానని అన్నారు. రాజేంద్రనగర్‌లో ప్రకాశ్ గౌడ్ నేతృత్వంలో పనిచేస్తానని, ఆయనకు ఇబ్బందిపెట్టనని అప్పుడే మాటిచ్చినట్టు వెల్లడించారు. ఆ మాట ప్రకారమే నడచుకుంటున్నానని చెబుతూ.. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఏ రోజైనా రాజేంద్రనగర్ రాజకీయాల్లో తలదూర్చానా అని ప్రశ్నించారు. ప్రకాశ్ గౌడ్ ఉన్నన్ని రోజులు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని అన్నారు. రాజేంద్రనగర్‌లో తనకు కేడర్ ఉన్నప్పటికీ, ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానా లేదా అన్నది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తన రాజకీయ భవిష్యత్తుపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.