Saturday, November 23, 2024

అవసరమైతే సరిహద్దులు దాటేందుకూ వెనుకాడబోం.. టెర్ర‌రిస్టుల‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక

దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు కూడా తాము వెనుకాడబోమని టెర్ర‌రిస్టుల‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో పాల్గొన్న అస్సాంకు చెందిన ఆర్మీ మాజీ అధికారులను శనివారం గౌహతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదులకు కఠిన సందేశాన్ని పంపారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. సరిహద్దులకు అవతల నుంచి దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సహించేది లేదన్నారు. ‘ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొంటామన్న సందేశం ఇవ్వడంలో భారత్ విజయవంతమైంది. బయటి నుంచి దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు వెనుకాడబోం’ అని అన్నారు. బంగ్లాదేశ్‌ స్నేహ దేశం కావడంతో పశ్చిమ సరిహద్దుతో పోల్చితే తూర్పు సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉందని, ఉద్రిక్తతలు, చొరబాట్లు తగ్గాయన్నారు.

ఒక ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడినప్పుడు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని రాజ్‌నాథ్‌ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టం తొలగింపు కోసం మూడు, నాలుగు ఏళ్లగా ఎంతో కసరత్తు జరిగిందని, ఇది చిన్న విషయం కాదన్నారు. అస్సాంలోని 23 జిల్లాలతోపాటు మణిపూర్‌, నాగాలాండ్‌లోని 15 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ చట్టాన్ని తొలగించినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో కూడా పరిస్థితి మెరుగుపడాలని ఆర్మీ కోరుకుంటున్నదని అన్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడితే అక్కడ కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement