ఏ ఆశయంతో బీజేపీలో చేరామో అవి నేరవేరలేదని.. పైగా ఆ పార్టీలో పెట్టుబడిదారులకే అవకాశాలు అన్నట్టుగా ఉందని విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్. బీజేపీని వీడి రావడంతో తనకు సొంతింటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చేయిపట్టుకుని నడిచానని, ఇక మీదట సీఎం కేసీఆర్‌ను వదిలి వెళ్లబోనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస దాకా కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారు దాసోజు శ్రవణ్.
ఇవ్వాల (శుక్రవారం) బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్. తనను మళ్లీ టీఆర్ఎస్లోకి వచ్చేలా చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని, టీఆర్ఎస్లోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ దేశానికే తలమానికంగా పనిచేస్తోందని, బీజేపీలో మోసపోయిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఎన్నో ఆశలతో బీజేపీలోకి వెళ్లామని, పెట్టుబడి నాయకులకు ప్రాతినిధ్యం వహించేలా ఆ పార్టీ తీరు ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు శ్రవణ్.