దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లుగా శిక్ష అనుభవించి సుప్రీం కోర్టు ఆదేశాలతో విడుదలయ్యింది నళిని శ్రీహరన్. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ సందర్భంగా నళిని భావోద్వేగానికి గురైంది. రాజీవ్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ మధ్యనే తనను జైలులో కలిశారని, రాజీవ్ హత్యపై పలు ప్రశ్నలు అడిగారని నళిని తెలిపింది. ఈ సందర్భంలో ప్రియాంక భావోద్వేగానికి గురైందని, ఆ సమయంలో తాను కూడా ఏడ్చినట్లు చెప్పింది. తన భర్తను తిరుచ్చి ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది నళిని.
ఇక.. తిరుచ్చి ప్రత్యేక శిబిరంలో తన భర్తను కలువబోతున్నట్లు తెలిపిన నలిళి.. తనకు ఓ కూతురు ఉందని, ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు తెలిపింది. కూతురు తన తండ్రిని కలుసుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తోందని చెప్పింది. ప్రస్తుతం తాను సంతోషంగా లేనన్న నళిని, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇందులో కమలా సర్ మెమోరియల్ ఒకటి అని తెలిపింది. అలాగే కేసు నుంచి బయటపడేందుకు సహకరించిన వారందరినీ కలవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపాలని, అట్లనే గాంధీ కుటుంబానికి చాలా కృతజ్ఞురాలునని, వారిని కలిసేందుకు అవకాశం వస్తే తప్పకుండా కలుస్తానని తెలిపింది.
ఈ సందర్భంగా జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్న నళిని.. గర్భవతిగా ఉన్న సమయంలోనే తనను జైలులో నిర్బంధించారని, ఉరిశిక్ష ఖైదిలను చూసిన మాదిరిగానే చూశారని చెప్పింది. ప్రస్తుతం ఫ్యామిలీకే ప్రాధాన్యమని, వృత్తిపరంగా ఏమీ చేయలేనని చెప్పింది. ఇప్పటికే తన జీవితమంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసిన నళిని, ఇకపై కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది ఆనంద్ సెల్వన్ మాట్లాడుతూ.. నళిని 30ఏళ్లకు పైగా జైల్లో జీవిస్తోందని, ఆమెకు సాయం చేయాలని కోరారు. నళిని కోసం 20 సంవత్సరాలు పని చేశామని, సత్ప్రవర్తన కారణంగా తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు.