Friday, November 22, 2024

ఆఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్న బైడెన్‌

ఫ్ఘ‌నిస్థాన్ ను తాలిబాన్లు తమ గుప్పిట్లో తీసుకోవడానికి కార‌ణం ఆమెరికానేనంటూ ప్ర‌పంచం దేశాలు విమర్శలు చేయడంపై ఆ దేశ అధ్య‌క్షుడు జోబైడెన్ ఘాటుగా స్పందించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాల ఉప‌సంహ‌రణ‌న‌ను ఆయ‌న గ‌ట్టిగా స‌మ‌ర్థించుకున్నారు. త‌మ ప‌ని ఆఘ్ఘ‌నిస్థాన్ జాతి నిర్మాణం ఏ మాత్రం కాద‌ని తేల్చి చెప్పారు. ఇది తాము ఎప్ప‌టికైనా చేయాల్సిన ప‌నే  అని.. కానీ కాస్త ముందుగా చేశామ‌ని వివ‌రించారు. 20 ఏళ్లుగా అమెరికా ద‌ళాలు అఫ్ఘాన్‌లో ఉంటున్నాయ‌ని.. వారి వెన‌క్కు ర‌ప్పించ‌డానికి ప్ర‌త్యేకంగా స‌రైన స‌మ‌యం అంటూ ఏదీ లేద‌ని జోబైడెన్ చెప్పుకొచ్చారు. బ‌ల‌గాల‌ను ఎప్పుడు ఉప‌సంహ‌రించుకున్నా ఇవే ప‌రిస్థితులు ఉండేవ‌ని.. ఇప్ప‌టికే ఆప్ఘాన్ ప్ర‌జ‌ల కోసం త‌మ సైనికులు ఎంత‌గానో చేశారని తెలిపారు.

ఆఫ్ఘాన్ రాజకీయ నాయకులే దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారని తెలిపిన జోబైడెన్..త‌మ‌ది కాని యుద్ధంలో అమెరికా బ‌ల‌గాలు చ‌నిపోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ కోసం ఇప్ప‌టికే అమెరికా ట్రిలియన్ డాలర్లు ఖ‌ర్చుపెట్టింద‌ని గుర్తు చేశారు. ఆఫ్ఘాన్ బాగుకోసం అవ‌స‌ర‌మైన అన్ని ప‌నులు చేసింద‌ని తెలిపారు. కానీ త‌మ భవిష్యత్తు కోసం పోరాడగ‌లిగే విశ్వాసాన్ని అందించలేకపోయామని చెప్పారు. తాలిబాన్ల‌తో పౌర యుద్ధానికి సిద్ధం కావ‌డంలో ఘ‌నీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌న్నారు.

గ‌త జూన్‌లో ఘ‌నీతో తాను ఫోన్‌లో మాట్లాడాన‌ని.. తాము బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నందున పౌర యుద్ధానికి సిద్ధంగా ఉండాల‌ని సూచించిన‌ట్టుగా చెప్పారు. అలాగే అవినీతికి నిర్మూలించి.. రాజ‌కీయ నేత‌లను ఏకం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పిన‌ట్టుగా గుర్తు చేశారు. కానీ అవేవీ ఘ‌నీ చేయ‌లేక.. చివ‌రికి చేతులెత్తేశార‌ని జోబైడెన్ ఆరోపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌పై తాము నిధులు ఖ‌ర్చుపెడుతూనే ఉండాల‌ని.. త‌మ ప్ర‌త్య‌ర్థులైన చైనా, ర‌ష్యాలు కోరుకుంటాయ‌ని పేర్కొన్నారు. త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనం కావాల‌నే వారు కోరుకుంటార‌ని బైడెన్ ఆరోపించారు. ఆఫ్ఘాన్‌ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ దౌత్యం కోసం ఆఫ్ఘన్‌ హక్కుల కోసం పాటుపడుతుందన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

- Advertisement -

ఇది కూడా చదవండి: అఫ్గాన్ టు భారత్.. సేఫ్ గా చేరుకున్న భారతీయులు

Advertisement

తాజా వార్తలు

Advertisement