మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ ఎస్ పార్టీ నుంచి రూ.25 కోట్లు ముట్టాయన్న బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇవ్వాల (శనివారం) కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లోని భాగ్యలక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారి ముందు ప్రమాణం చేశారు. తాను ఎట్లాంటి డబ్బులు తీసుకోలేదని, తనకు డబ్బులు ఇచ్చారని ఈటల చేస్తున్న ఆరోపణలు అబద్ధమన్నారు. దీనిపై ఈటల కూడా స్పందించి, తాను ప్రమాణ చేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ వద్ద డబ్బులేదని, ఆ ఖర్చు అంతా సీఎం కేసీఆర్ పెట్టారని ఈటల ఆరోపించారు. దీనిపై నిన్న రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నుండి తమ పార్టీకి ఒక్క రూపాయి ముట్టలేదని, కాంగ్రెస్ పార్టీయే ఖర్చు పెట్టుకుందని తెలిపారు. అదే సమయంలో ఈటల తన ఆరోపణలను రుజువు చేయాలని, కేసీఆర్ నుండి డబ్బులు తీసుకోలేదని తాను భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద శనివారం సాయంత్రం తడిబట్టలతో ప్రమాణం చేస్తానని సవాల్ చేశారు. లేదా ఈటల తన ఆరోపణలను నిరూపించాలన్నారు.
చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి భారీ కాన్వాయ్ తో భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గుడికి చేరుకున్నారు. ఆలయం వద్ద.. కేసీఆర్ నుండి తనకు డబ్బులు ముట్టలేదని రేవంత్ ప్రమాణం చేశారు మరోవైపు, ఈటల రాజేందర్ తన నివాసంలో కార్యకర్తలతో భేటీ కావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.