Friday, November 22, 2024

నాకు నచ్చితేనే వస్తా.. నేను స్వతంత్ర సభ్యుడిని.. ఏ పార్టీ నన్ను ఆదేశించలేదు: జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లి: నాకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరు అవుతాను.. పార్టీ విప్‌లతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తేల్చి చెప్పారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ విషయమై.. ఉభయ సభల్లో విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే గొగోయ్‌ మాత్రం సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. హాజరు శాతం 10లోపే ఉంది. దీనికి కారణం అడగ్గా.. అసోం నుంచి వచ్చిన నేను.. ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై సభలో గళం విప్పాలనే భావించాను. నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను.

రాజ్యసభకు హాజరుకాకపోవడంపై కారణం ఉంది. కరోనా వ్యాప్తి.. వైద్యుల సూచనల మేరకు సమావేశాలకు హాజరుకావడం లేదు. ఈ మేరకు రాజ్యసభకు లేఖ కూడా పంపించాను. నాకు నచ్చినప్పుడు.. నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తే.. సభకు వెళ్తాను. నేను నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికైన రాజ్యసభ స్వతంత్ర సభ్యుడిని. సభకు హాజరుకావాలని నన్ను ఏ పార్టీ కూడా ఆదేశించలేదు. నాకు నచ్చినప్పుడు వస్తాను. నచ్చినప్పుడు వెళ్తా.. ఇంకా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ అది సభలో కనిపించడం లేదు. కూర్చునే సీట్ల వ్యవస్థ సరిగ్గా లేదు. అందుకే రాజ్యసభకు హాజరుకావడం లేదు.. అని మాజీ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement