న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం తనముందున్న పెద్ద సవాల్ అని గవర్నర్ తమిళిసై అన్నారు. చెన్నైలో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణలో ఇవ్వాల తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చెప్పారని ఫైల్స్ ఫై సంతకం చేయడానికి తాను రబ్బరుస్టాంప్ గవర్నర్ ని కాదన్నారు. రాజకీయాలలో ఉన్నపుడు ప్రత్యర్థులు విమర్శలు చేశారని, తాను ఇప్పుడు గవర్నర్ గా ఉన్నపుడు కూడా అదే విధంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
తనను గవర్నర్ గా వేరే రాష్ట్రానికి మార్చాలని అందరూ మాట్లాడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనను తెలంగాణ గవర్నర్ నుంచి మారుస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదన్నారు తమిళిసై. ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో పుదుచ్చేరిని చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి , రాష్ట్ర గవర్నర్ కలిసి పనిచేయకపోతే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో తెలంగాణని చూస్తే అర్థం అవుతుంది అని వ్యాఖ్యానించారు.