Tuesday, November 26, 2024

HZB: సైలెంట్‌ ఓటింగ్‌.. 86.33 శాతం నమోదైన పోలింగ్‌

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు శనివారం జరిగిన పోలింగ్‌లో 86.33 శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 84.63 శాతం పోలింగ్‌ కాగా ఉప ఎన్నికలో 1.70శాతం అధికంగా ఓటింగ్ జ‌రిగింది. ఓటర్లు చివరి నిమిషం దాకా క్యూలైన్‌లో బారులుతీరి ఉండడంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి 8 గంటల వరకు సమయం పట్టింది.

ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ శనివారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసినప్పటికీ పలుచోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు.

వీణవంకమండలం గన్‌ముక్‌లో కౌశిక్‌ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగగా, జమ్మికుంటలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కమలాపూర్‌, ఇల్లందకుంట, జమ్మికుంట రూరల్‌ మండలం, హుజురాబాద్‌ పట్టణంలో డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కమలాపూర్‌లో ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌ వెంట ఉన్న మూడు వాహనాలను పోలీసులు అడ్డుకొని పీఆర్‌వోను ప్రశ్నించారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

ఇల్లందకుంట మండల కేంద్రంలోని 3వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో 7 గంటల సమయానికి 200 మందివరకు బారులు తీరి ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరో గంట సమయం పట్టింది. ఇదే మండల కేంద్రంలోని 224 పోలింగ్‌ బూత్‌లో గంటన్నర పాటు ఈవీఎంలు మొరాయించాయి. సైలెంట్‌ ఓటింగ్‌ జరగడంతో గెలుపు ఎవరివైపు ఉన్నది అన్నది చెప్పరాకుండా ఉంది. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ ఉండే అవకాశం ఉంది. సైలెంట్‌ ఓటింగ్‌ వన్‌ సైడ్‌ పడితే మెజారిటీ 20 నుంచి 30 వేలు దాటవచ్చు.

- Advertisement -

పోలింగ్‌ సరళిపై ఎవరికి వారుగా ధీమాలో ఉన్నారు. పోలింగ్‌ తమకు అనుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, సైలెంట్‌ ఓటింగ్‌, పెరిగిన పోలింగ్‌ శాతం తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఎవరిది అన్నది నవంబర్‌ 2న తేలనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ మూడో స్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఈటల రాజేందర్‌ సతీసమేతంగా కమలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకోగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌ కుమార్‌ హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

శనివారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 2,37,022 మంది ఓటర్లకు గాను 86.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం, సాయంత్రం 3 గంటల వరకు 61. 66 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement